కలియుగంలో అత్యంత సంపన్నుడైన శ్రీవారికి ఉన్న ఆస్తులు ఎంత?స్వామి వారికి భక్తులు సమర్పించిన ఆస్తుల విలువ ఎంత వుంటుంది?శ్రీవారికి ఏ ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయి ?భక్తులు స్వామి వారికి సమర్పించిన ఆస్తుల సంరక్షించే వ్యవస్థ టీటీడీ వద్ద ఉందా ?వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశవిదేశాల నుంచి తిరుమలకు తరలి వస్తుంటారు. తమ కోర్కెలు ఇట్టే తీర్చిన స్వామి వారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు.
శ్రీవారికి భక్తులు సమర్పించే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి. హుండీలో నగదు చెల్లించే భక్తులు కొందరైతే….బంగారం చెల్లించే వారి మరికొందరు…ఇక తమ బరువుకు సమానమైన పదార్దాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. వీరితో పాటు స్వామివారి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించే వారు మరికొందరు. ఏకంగా శ్రీవారికి విలువైన భూములను కానుకగా సమర్పిస్తారు భక్తులు. ఇక టీటీడీ నిర్వహించే ట్రస్ట్ లకు ఏటా 300 కోట్లు పైగానే విరాళంగా అందిస్తారు భక్తులు. ఇలా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారం దాదాపు పది టన్నుల పైగా బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ. ఇక ఫిక్స్ డ్ డిపాజిట్ ల కింద 8,500 కోట్ల రూపాయల నగదును వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసింది. వీటి ద్వారా వచ్చే ఆదాయం టీటీడీ హుండీకి తరువాత వచ్చే వాటిలో ప్రధానమైనది. మరో వైపు దేశవ్యాప్తంగా స్వామివారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు భక్తులు. కన్యాకుమారి మొదలుకొని జమ్ము వరకు వివిధ రాష్ట్రాలతో పాటు నేపాల్ వంటి దేశంలో కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తులు ఉన్నాయి.
గత ఏడాది టీటీడీ నిరర్దకమైన శ్రీవారి ఆస్తులు విక్రయించే అంశం వివాదాస్పదం కావడంతో ఇకపై వాటిని విక్రయించకూడదని నిర్ణయిస్తూ తీర్మానం చేసింది పాలకమండలి. దీంతో అసలు టీటీడీ ఆస్తులు ఎక్కడ వున్నాయి? వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు. వాటి ద్వారా టీటీడీకి వచ్చే ఆదాయం ఎంత? అన్యాకాంత్రమైన భూములు ఏవి?వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా? వంటి అనేక అంశాలను పరిశీలించడానికి నాలుగు బృందాలతో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది టీటీడీ పాలకమండలి. తిరుపతి, విజయవాడ ,విశాఖపట్నం, హైదరాబాదులో టాస్క్ పోర్స్ బృందాలు ఏర్పాటు చెయ్యడంతో వారు పరిశిలన జరిపి టిటిడికి దేశవ్యాప్తంగా 1128 ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
వీటిలో 2014కు పూర్వమే 173 ఆస్తులను 114 కోట్ల రూపాయలకు టీటీడీ విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం 75 ప్రాంతాలలో వున్న ఆస్థులు 7636 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వ్యవసాయ భూములు 1226 ఎకరాలు కాగా….వ్యవసాయేతర భూములు 6409 ఎకరాలు. 535 ఆస్తులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో వుండగా…159 ఆస్తుల టీటీడీ ఇతరులుకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏడాదికి నాలుగు కోట్ల పదిహేను లక్షల ఆదాయం ఆర్జిస్తోంది.
Tdp Protest: మీకో న్యాయం.. మాకో న్యాయమా?
.ఇక టిటిడి వినియోగంలో లేని 169 ఆస్తులను ఇతరులుకు లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది.మరోవైపు అన్యాక్రాంతమైన 29 ఆస్తులను గుర్తించిన టీటీడీ వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది .20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తుల విలువ 23 కోట్లు గా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఒక్క తిరుపతిలోనే ఐదు ప్రాంతాల్లో ఉన్న విలువైన టిటిడి ఆస్తులను కమిటీ గుర్తించి వాటి అభివృద్ధి పై దృష్టి సారించి .మరోవైపు 74 ఆస్తులకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తుండగా …12 ఆస్తులకు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు, ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడు రాష్ట్రం తంజావురు జిల్లా కబిస్థలం అనే ప్రాంతంలో ఆరు ఎకరాల టీటీడీ స్థలాన్ని గుర్తించింది కమిటీ. గతంలో వంద సంవత్సరాలకు ఈ స్థలాలు లీజుకు ఇవ్వడం….అప్పటికి టీటీడీ ఏర్పాటు కాకపోవడంతో ….వాటికి సంబంధించిన రికార్డులు లేకపోవడంతో వాటి గుర్తింపు ఇప్పుడు టీటీడీకి ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు దేశవ్యాప్తంగా 307 ప్రాంతాలలో టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించింది. ఇందులో 166 కల్యాణ మండపాలను నిర్వహణ బాధ్యత ఇతరులకు అప్పగించగా …29 కల్యాణ మండపాలను దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు లీజుకు ఇచ్చింది. వీటి ద్వారా టీటీడీకి ఏటా నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం లభిస్తుంది. మరో 97 కళ్యాణ మండపాలు నిర్వహణ మాత్రం టీటీడీ నిర్వహిస్తోంది. ఈ అనుభవాలను దృష్టిలో వుంచుకుని రాబోయే కాలంలో టీటీడీ ఆస్తుల గుర్తింపు సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా వున్న టీటీడీ ఆస్తులకు జియో ట్యాగీంగ్ మరియు జియో పెన్సింగ్ కార్యక్రమం ప్రారంభించింది. దీనితో ఆస్తులను సులభతరంగా గుర్తించవచ్చునని, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చంటున్నారు.