Tirumala: తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం పలు కార్యాలయాలతో పాటు వసతి గృహాలు, గెస్ట్ హౌస్‌లు, క్యూ క్లాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్‌లు, వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే తిరుమల వెళ్లే భక్తులు వీటికి వెళ్లే మార్గాలు తెలియక తికమక పడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం టీటీడీ తిరుమల మార్గదర్శిని పేరుతో ఓ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కొండపై ఒకచోటు నుంచి మరోచోటుకు సులభంగా వెళ్లేలా ఈ క్యూఆర్ కోడ్ సహాయం చేయనుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భక్తుల అరచేతిలోనే రూట్ మ్యాప్ ఉంటుంది.
Read Also:Civil aviation ministry: తాగి ఫ్లైట్ ఎక్కిన సీఎం..! విచారణకు కేంద్రం ఆదేశం..!
కాగా తొలుత మార్గదర్శినిని శ్రీవారి సేవకులతో టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. టీటీడీ గెస్ట్ హౌస్‌లు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలను ఈ క్యూఆర్ కోడ్‌లో టీటీడీ అధికారులు పొందుపరిచారు. దీనిని మొబైల్‌లో స్కాన్ చేయడం ద్వారా ఏవి ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు తాము వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అటు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.