AP High Court: తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేసింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది. ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమలలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
ఇక, తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామన్నారు. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈఓ, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కు సైతం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.