విజయవాడలో ప్రారంభమైన 32వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్‌గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానం నుంచి మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..పుస్తక అనువాదంతోనే భారతీయ భాషల సాహిత్యం విస్తృతం అవుతుందన్నారు. చిన్నారులకు పుస్తక పఠనం అలవాటు చేసేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ఇతర భాషల నుంచి రచనలను తెలుగులోకి అనువదించి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం పెరుగుతుందన్నారు. విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ మంచి గ్రంథాలయాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
Read Also:ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు: విజయసాయిరెడ్డి
అనంతరం పుస్తక ప్రదర్శన నిర్వాహకులు మాట్లాడుతూ.. జనవరి 4వ తేదీన ప్రెస్ క్లబ్ నుంచి బందర్ రోడ్ స్వరాజ్య మైదాన్ వరకూ పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 11వ తేదీ.. అనగా చివరిరోజున వీడ్కోలు సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఈ పుస్తక మహోత్సవానికి వచ్చే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి రావాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. కోవిడ్ నియమ, నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.