టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒంగోలు వెళ్లనున్నారు.. మూడు రోజుల పాటు అక్కడే బసచేయనున్నారు.. ఇవాళ ఒంగోలు వెళ్లనున్న ఆయన.. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు.. ఇక, చంద్రబాబు పర్యటన సందర్భంగా… విజయవాడ నుండి ఒంగోలు వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి టీడీపీ శ్రేణులు… ఆ బైక్ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా సరిహద్దు మార్టూరు నుండే స్వాగత ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు.. మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఒంగోలు చేరుకోనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం కానుంది.. మహానాడులో చర్చించే పలు కీలక అంశాలపై ఈ సమవేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు టీడీపీ నేతలు.. మొత్తంగా మూడు రోజుల పాటు ఒంగోలులోనే బస చేయనున్నారు చంద్రబాబు.
Read Also: YSRCP: వైసీపీకి షాక్.. మూకుమ్మడి రాజీనామాలు..!
ఇక, తెలుగుదేశం పార్టీ పండుగగా చెప్పుకునే మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది ఆ పార్టీ.. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని.. అలాగే భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ఈ నెల 27, 28వ తేదీల్లో ఒంగోలులోమహానాడు జరగనుండగా.. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది ఆ పార్టీ.. అయితే, అధికార వైసీపీ.. టీడీపీ మహానాడుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.. సభ కోసం స్థలం ఇవ్వక పోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడం, ప్రైవేట్ వాహనాలను అనధికారికంగా అజమాయిషీ చేస్తూ అధికార వైసీపీ అడ్డంకులు పెడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా అసలుసిసలు తెలుగు పండుగ మహానాడును విజయవంతం చేస్తామంటున్నారు నేతలు.