Srisailam Project gates will open on july 21st: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్లుండి (జూలై 21) శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో ఎల్లుండికి పూర్తి స్థాయి నీటి మట్టంకు నీరు చేరుకోనున్నాయి. శ్రీశైలం జలాశయంకు వరద నీటి చేరిక ప్రారంభమైన 10 రోజుల్లోనే డ్యామ్ పూర్తిగా నిండడం గమనార్హం.
శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కారణంగా నీటిమట్టం చాలా వేగంగా పెరుగుతోంది. కృష్ణ, తుంగభధ్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్ కు 3 లక్షలకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. రోజుకు సరాసరి కనీసం 25 టీఎంసీల నీరు చేరుతోంది. దీంతో నీటిమట్టం వేగంగా పెరిగి 10 రోజుల్లోనే డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాల్సి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873. 5 అడుగులు ఉంది. నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156.7596 టీఎంసీలు ఉంది. ఈనెల 21వ తేదీ నాటికి 885 అడుగులకు చేరువలో నీటిమట్టం చేరనుంది. శ్రీశైలం జలాశయానికి ఈనెల 12వ తేదీ నుంచి వరద నీటి చేరిక ప్రారంభమైంది. ఒకవైపు కృష్ణా నదికి, మరోవైపు, తుంగభధ్ర నదికి వరద నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం రోజుకు 80 నుంచి 10 అడుగులు పెరుగుతూ వచ్చింది. రోజుకు సరాసరి 25 టీఎంసీ ల నీరు శ్రీశైలం జలాశయంకు చేరుతోంది. కర్ణాటకలోని హోస్పెటలో తుంగభధ్ర జలాశయం నిండి దిగువకు నీరు విడుదల చేశాక శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షలకు పైగానే వరద నీరు వచ్చి చేరుతోంది.
Read Also: Minister Ambati Rambabu: పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదు
శ్రీశైలం జలాశయంలో ఈనెల 12న నీటిమట్టం 885 అడుగులకు గాను 824.5 అడుగులు ఉండగా నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీ లకు గాను 44.3482 టీఎంసీలు ఉంది. ఆల్మట్టి జలాశయం, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండి దిగువకు నీరు విడుదల చేశాక లక్ష 50 వేల క్యూసెక్కులు చొప్పున శ్రీశైలంలో చేరింది. అలాగే హోస్పెటలో తుంగభధ్ర జలాశయం నిండి 12వ తేదీ దిగువకు నీటి విడుదల ప్రారంభమై శ్రీశైలం ప్రాజెక్టులో చేరడం ప్రారంభించాక 3 లక్షలకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణ, తుంగభధ్ర నదులు పోటీపడుతున్నాయా అన్నట్టుగా వరద ఉధృతి కొనసాగుతోంది. అటు శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రారంభమైన మూడు రోజులకే తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. రోజుకు సుమారు 3 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి దిగువకు విడుదల చేస్తుంది. ఇప్పటికే సుమారు 15 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. ఏపీ కూడా కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది.