Minister Ambati Rambabu comments on polavaram project height: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టుపై వివాదం చెలరేగింది. గోదావరి వరదలకు భద్రాచలం మునిగిపోవడంతో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ఎత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను ఏపీలో కలపడాన్ని తప్పుబట్టారు. దీంతో మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పోలవరంపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముంపు ఉంటుందనే ఏడు మండలాలను ఏపీలో కలిపారన్నారు. పోలవరం ఎత్తు పెంపునకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందని తెలిపారు.
Read Also: YSRCP MP Vanga Geetha: వరదలకు అధిక వర్షాలే కారణం.. పోలవరం ఎత్తు కాదు
పోలవరం విలీన మండలాలను మళ్లీ తెలంగాణలో కలపాలని కోరడం సమంజసం కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము భద్రాచలం కావాలని అడిగితే ఇచ్చేస్తారా అని తెలంగాణ నేతలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. పోలవరం ఎత్తు 3 మీటర్ల ఎత్తు పెంచుతున్నామన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదని సూచించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టమన్నారు. దశల వారీగా మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి అంటి రాంబాబు స్పష్టం చేశారు. ఏపీలోనే కాదు.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే పోలవరం పెద్ద ప్రాజెక్టు అని.. ఒకేసారి స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యం పోలవరం ప్రాజెక్టుకు ఉందన్నారు.