ఏళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు కావడం లేదు.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను, అధికారులను తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు.. అధికారులు వివిధ సందర్భాల్లో కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు.. అయితే, ఈ వ్యవహారంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం అని వ్యాఖ్యానించారు.. విభజన చట్టంలోని చాలా హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగితే హామీలు అమలు చేయకపోవడం మరింత అన్యాయం అన్నారు.. ఇక, నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎక్కువగా పాలనకు సంబంధించినది.. చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, దానిని అంత ముఖ్యమైన అంశంగా నేను భావించటం లేదన్నారు సజ్జల… వీటి కంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలు రాష్ట్రానికి కీలకమైనవి పేర్కొన్న ఆయన.. మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం అన్నారు.
Read Also: KomatiReddy Rajagopal Reddy: కాంగ్రెస్‌లో ఘోర అవమానం జరిగింది.. రాజీనామాకు రెడీ..!
ఇక, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా పోలవరం బాధితుల పరిహారం విషయంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ముంపు గ్రామాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తాం అన్న ఆయన.. పరిహారం అందనివారికి మరింత గడువు ఇచ్చి పూర్తి పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.. ముంపు గ్రామాలను తరలించేందుకు వారికి త్వరగా పరిహారం అందించేందుకు కృషి చేస్తాం అన్నారు. పరిహారం చెల్లించేందుకు 20వేల కోట్లు అవసరం వుంది.. దీనికి కేంద్రం నుంచి సహకారం అవసరం అన్నారు సీఎం జగన్.. కేంద్రం నుంచి మనకి రావాల్సిన బకాయిలు చాలా వున్నాయి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో చలనం ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిహారం అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరామని తెలిపిన సీఎం.. గోదావరి ముంపు ప్రాంతాల్లో నేను పర్యటించా.. ప్రత్యక్షంగా వారి పరిస్థితిని చూసి వచ్చా.. పోలవరం నిర్వాసితులంతా మిమ్మల్నే తిట్టుకుంటున్నారు అని చెబుతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.