ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హతలుండాలి. అన్ని అర్హతలుండి కూడా ఠంచనుగా వస్తున్న పింఛన్ ఆగిపోతే వారి పరిస్థితి ఎలా వుంటుంది? కోర్టుల ద్వారా న్యాయం జరిగితే ఆ ఆనందానికి అవధులే వుండవు. తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛన్ వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజనమ్మ కు 65 ఏళ్ళు. 2019 నుంచి పింఛను అందుకుంటున్నారు.
జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను ఆగిపోయింది. అందుకు కారణం ఏంటని ఆరాతీసింది. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు. అయితే ఆమెకు వున్నది కేవలం 4.90 ఎకరాల మెట్ట భూమి. ఈ విషయం చెప్పినా ఆమె పట్టించుకోలేదు. గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛనును పునరుద్ధరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించారు. అయితే, ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను సరోజనమ్మకు అందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి పోరాడి విజయం సాధించిన సరోజనమ్మను పలువురు అభినందించారు.