Pawan Kalyan : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా సాగుతోంది. ఈ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తాను ఒక్కడిగా 2014లో జనసేన ప్రయాణం మొదలు పెట్టానని.. ఈ రోజు ఈ స్థాయి దాకా వచ్చామంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ముందు తమిళంలో ఒక పద్యం పాడారు. భయం లేదు కాబట్టే ఎవరికీ భయపడకుండా ఈ స్థాయి దాకా ఎదిగామంటూ దాని అర్థం చెప్పుకొచ్చారు. తాను ఏపీలో గత పదేండ్లుగా ఎన్నో అవమానాలు పడ్డానని గుర్తు చేసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ తనను అవమానించారని.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారని.. ప్రతిపక్షాలను వేధించారంటూ చెప్పారు. తనను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని దారుణంగా వేధించారని.. ప్రతిపక్ష లీడర్లను అరెస్టులు చేస్తారనే భయాలు ఉండేవన్నారు. తనను ఎన్ని రకాలుగా అవమానించారో అందరికీ తెలుసన్నారు. తనను తిట్టని తిట్టు లేదంటూ ఎమోషనల్ అయ్యారు.