Pawan Kalyan: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్‌తో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో రైతులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుత్ షాక్ కారణంగా పొలంలోనే మృతి చెందిన దుర్ఘటన తనను కలచి వేసిందన్నారు. తెగిన విద్యుత్ వైరు పొలంలో పడటం మూలంగా మృత్యువాత పడ్డ పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డిల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also: Andhra Pradesh: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు
కాగా విద్యుత్ వైర్లు తెగిపడ్డ ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని క్షేత్ర స్థాయి నుంచి తనకు సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంపై చూపే శ్రద్ధను ముందుగా విద్యుత్ తీగలు సక్రమంగా ఉండేలా చూడాలని పవన్ హితవు పలికారు. ఉడతలు కొరికాయి కాబట్టి తీగలు తెగాయి లాంటి కారణాలు చెప్పి సమస్యను మరుగున పడేయవద్దని సూచించారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుని న్యాయబద్ధమైన పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
విద్యుత్ షాక్ తో రైతుల దుర్మరణం దురదృష్టకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5KSP8wVNMx
— JanaSena Party (@JanaSenaParty) October 28, 2022