నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వైసీపీ నాయకుడి దాష్టీకం బయటపడింది. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసి ఏజెంట్‌గా నిలబడ్డారన్న అక్కసుతో బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడు హజరత్తయ్య దాడికి పాల్పడ్డాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి రూమ్‌లో నిర్బంధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే బాధిత మహిళ భయపడకుండా వైసీపీ నేత హజరత్తయ్యపై చేజర్ల పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పద్మమ్మ ఫిర్యాదు చేసింది.
Read Also: Hyderabad Party: మితిమీరుతున్న పార్టీలు.. దీనికి ఆర్గనైజర్ మహిళే!
కాగా ఈ విషయం తెలుసుకుని బాధితురాలిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్‌లో పరామర్శించారు. ఈ విషయాన్ని వదిలేది లేదని.. డీజీపీ , ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం చెయ్యకుంటే చేజర్ల పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్‌పై వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి గెలిచినా బీజేపీ నేతపై వైసీపీ నేత దాడికి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.