చంద్రబాబులా కుట్రలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదన్నారు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజా బలంతో జగన్ గెలిచారన్నారు. విశాఖ తగరపువలస రెండో రోజు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న అదరణ చూసి ఓర్వలేక తన తొత్తు అయిన పట్టాభితో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు తానేటి వనిత. రాష్ట్రం లో అలజడి,శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం నేత చంద్రబాబు ఆలోచనగా వుందన్నారు.
జగన్ ప్రభుత్వం పై గంజాయి ఆరోపణలు చేస్తున్న 40 ఇయర్స్ ఇండ్రస్టీ అని చెప్పుకునే ప్రతి పక్షనేత గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసినప్పుడు ఏం చేశారో, ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. గిరిజనులకి భూమి పట్టాలిచ్చి వారిని అదుకున్న ప్రభుత్వం తమది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు, పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బీశెట్టి సత్యవతి.
వేపగుంట నాలుగురోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన జనాగ్రహ దీక్షలో ఎంపీ సత్యవతి పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు చూడలేక వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయిపోయిందని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలకు, దాడులకు మూల కారణం చంద్రబాబే అని వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.