పక్కరాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్ధమవుతుందన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలా అభివృద్ధి ప్రాంతంగా మారిన హైదరాబాద్ గురించి ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందని మల్లాది విష్ణు చెప్పారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ నేతలు కల్పిస్తున్నారని విశ్లేషించారు. ఏపీ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా అని మంత్రి కేటీఆర్ ను మల్లాది విష్ణు ప్రశ్నించారు.
మరోవైపు సీఎం జగన్ పాలనలో అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు తెలిపారు. పథకాల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్లో మీడియా ప్రభుత్వ పథకాల గురించి వక్రీకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ హయాంలో మహిళలను చిన్న చూపు చూశారని.. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.
KTR on AP: ఏపీపై కేటీఆర్ సెటైర్లు.. అక్కడ రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవు