తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు.. వరుసగా దాదాపు పదిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు.. రెండు, మూడు రోజులు తెరపి ఇచ్చినా.. ఇవాళ ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, వర్షాకాలంలో విజృంభించే విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పాడేరు ఏజెన్సీ మలేరియా, డెంగ్యూ జ్వరాలతో వణికిపోతోంది. సీజన్ మారడం, కలుషిత నీటిని తాగడం కారణంగా అడవి బిడ్డలు జబ్బుపడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పీ.హెచ్.సీల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి.
Read Also: Google halt hiring: గూగుల్ కీలక నిర్ణయం.. హైరింగ్ ప్రక్రియ నిలిపివేత..
హాస్పిటల్స్ సామర్ధ్యానికి మించి రోగులు వస్తుండటంతో పూర్తి స్థాయి వైద్యసేవలు అందించడం కష్టంగా మారుతోంది. జిల్లా కేంద్రమైన పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు వారీ నమోదయ్యే రోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో వంద లోపు వుండే ఓపీ… దాదాపు రెట్టింపు అయ్యింది. గిరిజన మారుమూల గ్రామాల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి వస్తున్న అడవి బిడ్డల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బాధితుల్లో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు వందల బెడ్ ల సామర్థ్యం ఉన్న పాడేరు జిల్లా ఆసుపత్రి ఇప్పటికే ఫుల్ అయిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది యంత్రాంగం. కొండలు, కోనల్లో విసిరేసినట్టుగా ఉండే గిరిజన తండాల్లో వర్షా కాలం ఎదుర్కొనే ప్రధాన సమస్య శుభ్రత లేకపోవడం. ఎక్కువ రోజులు వర్షంలో గ్రామాలు తడిచి ముద్దవ్వడం, ప్రవాహాల్లో వరద నీటిని సేవించడం వంటి కారణాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలంతా వాతావరణంలో మార్పుకి అనుగుణంగా కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని, పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.