Nadendla Manohar: గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతనగర్లో రౌడీ షీటర్ దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకుమాను ఇంద్రజిత్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అయితే, సోమవారం రాత్రి నాజర్ పేటకు చెందిన ఇంద్రజిత్ పై ఐతానగరకు చెందిన రౌడీ షీటర్ సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డూ దాడి చేసి గాయపరచడంతో బాధితుడు తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జనసేన పార్టీ సానుభూతిపరుడు కావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించారు. దాడికి గల కారణాలను ఇంద్రజిత్ నీ అడిగి మంత్రి తెలుసుకున్నారు.
Read Also: Anitha- Pawan: డిప్యూటీ సీఎం పవన్ని కలిసిన హోంమంత్రి అనిత.. కీలక అంశాలపై చర్చ!
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈ దాడి ఘటన బాధాకరం.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. చిల్లర వేషాలు వేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలపై దృష్టి సారించాలి.. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు గతంలోనే ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.