అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్‌లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి నివాసాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ఈడీ అధికారులు ఎందుకు జేసీ సోదరులను టార్గెట్ చేశారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.. దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి.. మైనింగ్, ట్రాన్స్‌పోర్టుతో పాటు అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వారిని వరుసగా కొన్ని కేసులు వెంటాడాయి.. ఇప్పుడు ఈడీ రంగంలోకి వచ్చింది. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఈడీ అధికారులు ఎందుకు వచ్చారన్నదానిపై రెండు, మూడు రోజుల్లో తెలుస్తుందన్నారు.. ఈడీ సోదాల వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని అనుకోవడం లేదన్న ఆయన.. ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకున్నది లేదు, దొరికింది లేదన్నారు.. అధికారులకు కావాల్సిన సమాధానం తీసుకున్నారు.. రెండు, మూడు రోజుల్లో దానిపై క్లారిటీ వస్తుందన్నారు. అందరి సెల్‌ఫోన్లు ఇచ్చారు.. నా సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదని తెలిపారు. కాగా, నిన్న ఉదయం ఈడీ సోదాలు ప్రారంభమైన వెంటనే జేసీ కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు మొత్తం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా జేసీ ఇంట్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సాగిన ఈడీ సోదాలు చర్చగా మారాయి.