ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రోడ్లు, తాగునీటి సరఫరాపై సోమవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ఆదేశాల్ని జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన ఈ సమీక్షలో.. రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని జగన్ సూచించారు. టెండర్లు పూర్తి చేసి, జూన్ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని.. నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలన్నారు.
చెరువుల్ని కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పని చేయాలని, రానున్న ఐదేళ్లలో ప్రతి చెరువును కెనాల్, ఫీడర్ చానెల్స్‌కి లింక్ చేయగలిగితే నీటి సమస్యని నివారించగలుగుతామని జగన్ అన్నారు. ఆర్బీకే, డిజిటల్ లైబ్రరీస్, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాల్ని కూడా త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదన్నారు. అవసరమైతే దీనికోసం ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాల్సిందిగా కోరారు.