GVL Narasimha Rao: విశాఖ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ కావాలని అడిగింది నిజమా.. కాదా అని ప్రశ్నించారు. విశాఖ భూములను రాజకీయ పార్టీలు అడ్డగోలుగా దోచుకున్నాయని జీవీఎల్ ఆరోపించారు. 42 వేల కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు ప్రజల కళ్లు గప్పే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు చేశారు.
Read Also: CM KCR Delhi Visit: బీఆర్‌ఎస్ ప్రకటన తర్వాత తొలిసారి హస్తినకు కేసీఆర్.. ఏం జరగబోతోంది..?
అటు విశాఖ భూముల వ్యవహారంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. గతంలో సిట్‌తో విచారణ జరిపారని.. ఇప్పటివరకు రిపోర్ట్ రాలేదని లేఖలో ఆయన గుర్తుచేశారు. ఈ అంశంపై రెండు సార్లు సిట్ విచారణ జరిగినా రిపోర్టులను తొక్కి పెట్టారని జీవీఎల్ ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని సిట్ రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులను సెక్షన్ 22 ఏలో పెట్టి వేధిస్తున్నారని.. వైసీపీ ప్రజాద్రోహ చర్యలు చేస్తోందని మండిపడ్డారు. బడాబాబుల భూములను సెక్షన్ 22 ఏ నుంచి తప్పిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు.