ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు.. ఒక రాజధానిగా ఉన్నా.. ఇప్పుడే ఏ అధికారి దొరకడం లేదు.. మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి..? అని నిలదీశారు.. కేంద్రం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. రాజధానిని మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అని అంటారా? అంటూ ఎద్దేవా చేశారు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే లాజిక్‌లో వెళ్లి.. రాజధానిని కూడా వేరే వేరే ప్రదేశాల్లో పెడితే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.
Read Also: Rajya Sabha: రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి, పీటీ ఉష
ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరం అంటూ మండిపడ్డారు అశోక్ గజపతిరాజు.. గత టీడీపీ ప్రభుత్వంలో.. భూ సేకరణ చేసి శంకుస్థాపన కూడా చేశాం.. ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన అంటే అర్థంలేదన్నారు.. మరోవైపు.. వైసీపీ నేతల భాషపై స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం భాష గురించి మాట్లాడటం గమ్మత్తుగా ఉందన్నారు.. సరైన భాషను ఉపయోగించాలని వైసీపీ వాళ్లే చెబుతున్నారు.. కానీ, వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు.. సర్పంచ్ లకు విలువ లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.. జిల్లాలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తాం.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టారు.. ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు అంటూ వైసీపీ నేతలకు సూచనలు చేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.