ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు. సామాన్య భక్తులకు ఈ ఉత్సవాలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. 120 సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షిస్తుంటారు.. కంట్రోల్ రూం నుంచి ఇదంతా కంట్రోల్ చేస్తారని అన్నారు. వీవీఐపీల దర్శనాలు 8 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటాయని మంత్రి చెప్పారు. ఏ దర్శనం క్యూలైన్ వీవీఐపీల దర్శనాల సమయంలో ఆపడం జరగదన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు దర్శనం ఉంటుందన్నారు. బంగారు వాకిలి వరకే దర్శనం… అంతరాలయ దర్శనం లేదని తెలిపారు.
Read Also: Andhra Pradesh: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం..
ఇదిలా ఉంటే.. ప్రసాదాల విషయంలో రాజీ ధోరణి లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. వాటర్ బాటిళ్ళు, ప్యాకెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించాం.. 35 లక్షల వాటర్ బాటిళ్ళు, ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై వీఎంసీతో కలెక్టర్ సమీక్ష జరిగింది.. పారిశుధ్య బాధ్యత వీఎంసీదేనని అన్నారు. నగరమంతా ప్రత్యేక అలంకరణ 2వ తేదీ సాయంత్రానికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే.. మూల నక్షత్ర వేళలో సీఎం చంద్రబాబు సకుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు డిపార్ట్మెంట్ హెడ్‌లతో తుది సమీక్ష చేపడుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్‌గాంధీ మౌనం ఎందుకు..?