ప్లాస్టిక్ వస్తువులతో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇకపై క్లాత్‌తో తయారు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే వినియోగించాలని సూచించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇవాళ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం… పర్యావరణ పరిరక్షణ చట్టం కింద 2022 నవంబరు 1 తేదీ నుంచి నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తికి, దిగుమతికి ఎవరికీ అనుమతి లేదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Hyderabad Metro Rail: మెట్రో రైల్ పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడుద్ది.. ఫైను, జైలు..!
ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనకు కూడా నిషేధం వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇనస్పెక్టర్లు బాధ్యత వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా జిల్లా కలెక్టర్లు, జెడ్పీసీఈవోలు, పంచాయితీ అధికారులు, గ్రామ సచివాలయాలు బాధ్యత వహించాల్సిందిగా సూచనలు జారీ చేసింది.. నిషేధం ఉత్తర్వులు అమలు తర్వాత ప్రతీ ఫ్లెక్సీకి రూ. 100 మేర జరిమానా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్ష తప్పదని హెచ్చరించింది.. ఫ్లెక్సీల నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ అమలు పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణా, జీఎస్టీ తదితర అధికారులు చేపట్టాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వస్త్రాలను వినియోగించుకోవచ్చని సూచనలు ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.