ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మహమ్మారి బుసలు కొడుతోంది.. వరుసగా భారీ స్థాయిలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత క్రమంగా కోవిడ్ మీటర్ పైకే కదులుతోంది.. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య తగ్గినా.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ పరీక్షించగా 13,212 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఐదుగురు కోవిడ్ బాధితులు మరణించారు. విశాఖలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇదే సమయంలో ఒకేరోజు 2,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటి వరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 3,20,56,618కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసులు 21,53,268కి, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 20,74,600కి, మొత్తం మరణాల సంఖ్య 14,532కి పెరిగాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖలో 2,244 కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 1,585, అనంతపురం 1,235, శ్రీకాకుళం 1.230, గుంటూరు 1,054, నెల్లూరులో 1,051 కేసులు నమోదు అయ్యాయి.