Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో రెండో విడత భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామంలో తొలిరోజు గ్రామసభ నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ, భూ సమీకరణ పర్యవేక్షణ కోసం CRDA అథారిటీ వడ్డమాను యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు, రైతులతో కలిసి భూ సమీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించారు.
Read Also: Theft: కేపిహెచ్ బిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో.. రూ.50 లక్షలు విలువైన వెండి ఆభరణాలు చోరీ
అయితే, గ్రామసభలో పాల్గొన్న రైతులు అమరావతి చట్టబద్ధత, అభివృద్ధి, భూములు ఇచ్చే అన్నదాతలకు లభించే ప్రయోజనాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
* అమరావతికి చట్టబద్ధత ఎక్కడ ఉంది?
* మొదటి విడతలో ఎంత వరకు అభివృద్ధి జరిగింది?
* మొదటి విడతలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది?
* మూడేళ్లలో అభివృద్ధి పూర్తవుతుందని గ్యారంటీ రాసిస్తారా?
* మూడేళ్లలో రాజధాని అభివృద్ధి కాకపోతే కోర్టుకు వెళ్లే పరిస్థితి వస్తుందా?
* ఇది గ్యారంటీనా? లేక రాజకీయ మాటలేనా? అని రైతులు ప్రశ్నించడంతో గ్రామసభ ఉద్రిక్తంగా మారింది.
Read Also: GST: జీఎస్టీ ఎగవేతపై డీజీజీఐ ఉక్కుపాదం.. రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు.. ఇద్దరు ఎండీలు అరెస్టు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతుల ప్రశ్నలకు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టం ఇప్పటికీ ఉంది, అది చట్టబద్ధమైన రాజధానిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయాల కోసమే గత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం రైతులకు ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశలో అభివృద్ధి నెమ్మదిగా కొనసాగినా, ఇప్పుడు రెండో దశతో వేగం పెరుగుతోందని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పారు.
ఇక, రైతులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. 2019-24 మధ్య అమరావతిలో అభివృద్ధి జరగలేదని, కోర్టు ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఎంత వరకు అభివృద్ధి జరిగిందో అందరికి తెలుసని అన్నారు. కాగా, అమరావతిలో అభివృద్ధి కోసం మొత్తం 7 రెవెన్యూ గ్రామాల్లో 16,666.57 ఎకరాల భూ సమీకరణ చేయనుంది సీఆర్డీఏ. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తుంది. అయితే, వడ్డమానులో 1,937 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాల కోసం ఇప్పటికే అథారిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చాయి.