గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాలతోపాటు పక్కనే ఉన్న తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఫార్మూలా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.
ఒకప్పుడు ఎన్నికలంటే కాంగ్రెస్.. లేదంటే బీజేపీ.. మరీ అయితే కమ్యూనిస్టుల మధ్యే నడిచేది. నాడు ఓటర్లంతా పార్టీలను చూసి ఓటేసేవాళ్లు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఎంటరయ్యాయో సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ పార్టీలను తలదన్నేలా ప్రాంతీయ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తున్నాయి. ఈ పార్టీల సపోర్టు లేకుండా జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం అనేది కష్టంగా మారింది. దీంతో రాష్ట్రాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే సత్తాచాటుతూ ఎక్కువకాలం రాజకీయంగా మనగలుగుతున్నాయి.
ప్రాంతీయ పార్టీలన్నీ ఏక నాయకత్వంపైనే పని చేస్తుంటాయి. అధినేత చరిష్మాపైనే ఆపార్టీ మనుగడ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఫేస్ వాల్యూ తెరపైకి వచ్చింది. ఆయన ఫొటో పెట్టుకుంటే గెలుస్తామనే నమ్మకం అభ్యర్థుల్లో ఏర్పడింది. ప్రజలు సైతం పార్టీ అధినేత చూసి ఓట్లు వేయడం ప్రారంభించారు. ఆయన తర్వాత అంతటి చరిష్మా కలిగిన నేతగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. హస్తం గుర్తుకు ‘వైఎస్’ ఇమేజ్ తోడు కావడంతో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు నాడు అధికారంలోకి వచ్చింది. ఆయన మరణం తర్వాత ఏపీ, తెలంగాణలోనూ ఈ పంథానే కొనసాగుతూ వస్తోంది.
2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మతోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. తండ్రి అడుగు జాడల్లోనూ నడుస్తున్నారు. ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకెళుతున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్ బొమ్మతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఫొటోతో జనాల్లోకి వెళ్లనున్నారు. దీంతో జనాలు వైసీపీని ఖచ్చితంగా ఆదరిస్తారని సీఎం జగన్ నమ్ముతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం చంద్రబాబు ఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఏపీలో ఎవరి ఫేస్ వాల్యూ ఎంత అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈక్రమంలోనే టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో తాము చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్తలు అవసరం లేదని పరోక్షంగా వైసీపీని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీని నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాను తన బొమ్మతోనే గెలిచానంటూ మధ్యలో దూరిపోతున్నాడు. కిందటి ఎన్నికల్లో జనాలు జగన్ బొమ్మ కంటే తన ఫొటోను చూసే ఓట్లు వేశారంటూ చెబుతున్నాడు. దీంతో ఎవరీ ఫేస్ వాల్యూ ఎంత అనేది తేల్చేందుకు జనాలు కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభ్యర్థులు కేవలం అధినేత చరిష్మా పైనే ఆధారపడకుండా జనాల్లో తమకంటూ ఓ ఫేస్ వాల్యూను పెంచుకుంటూనే ‘విజయలక్ష్మి’ వరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం జనాల్లోకి కదలండి మరీ..!