భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ నుంచి నేపాల్‌లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి సుసంద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ సమాచారాన్ని అందించినట్లు వివరించారు.
నిందితుల నుంచి రెండు పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, 133 డాలర్ల అమెరికా కరెన్సీ, రూ.2,000 భారత కరెన్సీ, భారత ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు అరెస్టైన ఇద్దరు చైనా జాతీయులను ఎస్ఎస్బీ అధికారులు, పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరూ మే 23న ఒక మహిళతో కలిసి థాయిలాండ్ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండుకు వచ్చారు. నెల రోజుల నేపాల్ వీసాను పొందారు. మే 24న ట్యాక్సీలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్పూకు వచ్చారు. అక్కడి నుంచి ఢిల్లీ సమీపంలోని నోయిడాకు వెళ్లారు. అక్కడ మరో చైనా జాతీయుడైన జాకీ ఇంట్లో జూన్ 10 వరకు ఉన్నారు. అనంతరం నేపాల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ట్యాక్సీలో భితామోర్కు చేరుకున్నారు. సీతామర్హికి చేరుకుని అక్కడి నుంచి రిక్షాలో నేపాల్ సరిహద్దులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.