మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడు. దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు చంద్రబాబు తిరుపతినే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అని అడిగారు. తిరుపతికి రోజూ లక్ష మంది వరకు భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అర్బన్ ప్రాంతంలో బస్సులు పెట్టి ఎవరైనా ఓటర్లు కాని వాళ్ళను తరలించగలుగుతారా అని ప్రశ్నించిన ఆయన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు, పర్యవేక్షకులు, వెబ్ కామ్ మానిటరింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటుందా అని అన్నారు. హేయమైన, దుర్మార్గమైన చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు.