కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ సుబ్రమణ్యం డెడ్‌బాడీ లభించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు సుబ్రమణ్యం మృతిపై చంద్రబాబు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎం.ఎస్.రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావును చంద్రబాబు ఎంపిక చేశారు. శనివారం నాడు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది.
కాగా డ్రైవర్ సుబ్రమణ్యం చనిపోవడానికి ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీని శుక్రవారం ఉదయం పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా సుబ్రమణ్యం కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీకి సుబ్రమణ్యం రూ. 20 వేలు బాకీ ఉన్నాడని… ఈ విషయమై సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు అడిగేవాడని కుటుంబీకులు చెబుతున్నారు. కొంత సమయం ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తామని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పాడని వాళ్లు వివరిస్తున్నారు.