Minister Gottipati Ravi Kumar: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల అని పేర్కొన్నార ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే… జైలుకు పంపుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గొట్టిపాటి రవి మండిపడ్డారు.. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. సమాజంలో ఇలాంటి వారు నాయకులుగా చెలామణి కావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులతో మా చంద్రబాబును ఒక్కసారి జైలుకు పంపినందుకే రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టారని గుర్తు చేశారు.
Read Also: Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
గత ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దుయ్యబట్టారు.. ప్రజలు అధికారం ఇచ్చేది పగలు, ప్రతీకారాలు తీర్చుకునేందుకు కాదనే విషయం వైసీపీ నాయకులు గుర్తించాలని హితవు పలికారు. ఈ విషయం గుర్తించి ఉంటే కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కేదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశతో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని… అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడం కేవలం కలలోనే సాధ్యమని మంత్రి గొట్టిపాటి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడును విజయసాయి రెడ్డి క్రిమినల్ అని సంభోదిస్తున్నారని పేర్కొన్న మంత్రి… అక్రమార్జన, అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డీలే అసలు క్రిమినల్స్ అని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు వీలైతే ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని కానీ.. నోటికి వచ్చినట్లు ఎడాపెడా మాట్లాడితే ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.