కరోనా రక్కసి ప్రజల జీవితాల్లో మిగిల్చిన బాధలు అన్నిఇన్ని కావు.. కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మరణించారు. దీంతో అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఇల్లు.. పెద్ద దిక్కు లేకుండా పోయింది.. ఒక్కో కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ కరోనాకు బలై.. పిల్లలు అనాథలుగా మిగిలారు. ప్రజల జీవితాల్లో ఎన్నో విషాదాలను, బాధలను మిగిల్చింది కరోనా.. అంతేకాకుండా కరోనా దెబ్బకు ఎన్నో వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అతలా కుతలమయ్యాయి. అయితే.. కరోనా ఇచ్చిన గునపాఠం నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకున్నానంటోంది కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు ఉబెర్ బైక్ రైడర్. ఈ విషయాన్ని రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. మౌతుషి బసు కరోనా కంటే ముందు పానసోనిక్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే కరోనాతో ఉద్యోగం కొల్పోయిన ఆమె.. కుటుంబ పోషణ కోసం ఉబెర్ డ్రైవర్ అవతారమెత్తింది.
రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్‌లో… కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేస్తే మౌతుషి బసు వచ్చారని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆమెను ప్రశ్నిస్తే చెప్పిన విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, తాను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదానినని, కరోనా కారణంగా ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారినట్టు చెప్పారని రణవీర్ వివరించారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె బండిని చాలా జాగ్రత్తగా నడిపారన్న రణవీర్.. అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని తెలిపారు. గతంలో బండి నడిపిన అనుభవం ఉందా? అని ప్రశ్నిస్తే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదని బసు సమాధానం ఇచ్చారన్నారు. బసు కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.