ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… ప్రస్తుతం రాష్ట్రంలో వింత ప్రభుత్వం ఉంది.. వింతైన సీఎం వున్నారు.. ఇక్కడ అప్రకటిత నియంత పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ రఘురామ కృష్ణపై దాడి ఆరోపణలు నిజమని తేలితే అంత కంటే హేయమైన చర్య మరొకటి ఉండదన్న ఆయన.. రఘురామ కృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంట్ పై దాడిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్న బీజేపీ నేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తగిలిన గాయాలపై ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యుల బృందంతో నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయింపు కాదని రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, తర్వాత పరిణామాలు హెచ్చరికాగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు భయ భ్రాంతులు కాకుండా ఉండాలంటే శనివారం, ఆదివారం కోర్టులు తెరిచి ఉంచాలి…. కోవిడ్ నియంత్రణలో విఫలమైన జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు నుంచి తప్పుకుని ఆయన భార్యకు కానీ ఇతరులకు కానీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు విష్ణుకుమార్ రాజు.