చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి తక్కువ హాని చేసే టపాసులను మాత్రమే కాల్చాలి. ప్రతి ఒక్కరూ గ్రీన్ క్రాకర్స్ కాల్చడం పర్యావరణానికి ఉత్తమం.
Read Also: ఆ దేశాల్లో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం… కాల్చితే…
టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
☛ చేతులకు శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించడం, క్రాకర్స్ కాల్చడం వంటివి చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే చేతులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది
☛ టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. టపాసులు కాల్చే సమయంలో ప్రమాదవశాత్తూ దుస్తులకు మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. కాటన్ మినహా ఇతర వస్త్రాలకు త్వరగా మంటలు అంటుకుంటాయి. కాబట్టి కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
☛ టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం మంచిది. తద్వారా నిప్పు రవ్వలు కళ్లలో పడకుండా ఉంటుంది.
☛ మద్యం సేవిస్తూ బాణసంచా కాల్చవద్దు. మద్యానికి మండే గుణం ఉంటుందనే విషయం మరవద్దు.
☛ పేలకుండా ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అది అకస్మాత్తుగా పేలితే గాయపడే ప్రమాదం ఉంటుంది.
☛ జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం. దయచేసి ఇలా చేయవద్దు
☛ గాజు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం