అగ్రరాజ్యం అమెరికా ‘సెప్టెంబర్ 11’ రోజును కలలో కూడా మర్చిపోలేదు. ఈరోజునే అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించి అమెరికాకు సానుభూతి తెలిపాయి. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకు అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారిదంటూ ఆ దేశంపై దాడి చేసి వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈక్రమంలోనే నాటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా నామరూపల్లేకుండా చేసింది. అయితే 20ఏళ్లు తిరిగే సరికి అప్ఘనిస్తాన్లో మళ్లీ అవే ఛాయలు కన్పిస్తున్నాయి. అఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో ఆదేశం తిరిగి తాలిబన్ల పాలనలోకి వెళ్లడం శోచనీయంగా మారింది.
అఫ్ఘన్ పై దురాక్రమణ చేసిన తాలిబన్లు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. సెప్టెంబర్ 11న తాలిబన్ల కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఈమేరకు అప్ఘన్ తాత్కాలిక ప్రధానిగా ముల్లా మహమ్మద్ నియామమం అయ్యారు. ఈయనతోపాటు మరికొంతమంది కేబినెట్ మంత్రుల లిస్టును తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు ఇప్పటికే ప్రకటించారు. ఈక్రమంలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాలిబన్లు సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈరోజునే ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడి అధికారిక భవనం మీద తాలిబన్లు తమ జెండాను ఎగురవేశారు. భవనం ప్రధాన ముఖ ద్వారం వద్ద భారీ జెండాను కట్టడంతో బ్యానర్లను ప్రదర్శించారు. ఈమేరకు తాలిబన్ల సాంస్కృతిక కమిషన్ అధినేత అహ్మదుల్లా ముత్తాకీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్ష భవనంపై తెల్లటి బ్యానర్‌పై నల్లరంగు అక్షరాలను ముద్రించిన పతాకాన్ని తాము ఎగురవేసినట్లు ఆయన తెలిపారు. తమ పరిపాలన అఫ్ఘన్లో ప్రారంభమైందని చెప్పడానికి ఈ పతాకం నిదర్శమని ముక్తాకీ స్పష్టం చేశారు.
న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న రోజే తాలిబన్ల పతకాన్ని ఎగరవేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని ముక్తాకీ తేల్చిచెప్పారు. ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్లు అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించిన విధివిధానాలు ఎలా ఉండాలనే విషయంపై తాలిబన్ల అగ్ర నాయకత్వం వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో సంప్రదింపులను జరుపుతుందని స్పష్టం చేశారు.
గతంలో తాలిబన్లు పాలించినట్లుగా మత ఛాందసవాదాన్ని.. ఇస్లామిక్ భావజాలానికి ఈసారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే తమ పరిపాలన సాగుతుందన్నారు. అదే సమయంలో వివాదాస్పదమైన షరియా చట్టాన్ని ఖచ్చితంగా అనుసరిస్తామని ముక్తాకీ స్పష్టం చేశారు. దీంతో అఘన్లో కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఏదిఏమైనా తాలిబన్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చినరోజే తమ పతకాన్ని అఫ్గన్లో ఎగువేసి ఆదేశానికి కౌంటర్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు కన్పిస్తోంది.