ఆ జిల్లాతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయం. అప్పుడెప్పుడో ఒకసారి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల ఓ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె.. ఓ సీనియర్ నేతను ఉద్దేశించి.. మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఓ కామెంట్ పాస్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నాయకుడి అనుచరులకు సంతోషానివ్వగా.. జిల్లా రాజకీయాల్లో మాత్రం కొత్త పెట్టేలా ఉన్నాయట. ఇంతకీ ఎవరామె? ఏంటా కామెంట్స్?
ప్రసాదరావును ఉద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై చర్చ!
శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి స్థానంలో బుక్ రిలీజ్ చేశామా? ఓ నాలుగు మాటలు మాట్లాడామా.. వెళ్లిపోయామా? అనేలా కాకుండా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ కార్యక్రమంలో లక్ష్మీపార్వతితోపాటు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావును ఉద్దేశిస్తూ లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలే జిల్లా అధికారపార్టీ వర్గాల్లో చర్చగా మారాయి.
ప్రసాదరావు మంత్రి కావాలని కోరుకుంటున్నట్టు లక్ష్మీపార్వతి కామెంట్!
రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమన్న లక్ష్మీపార్వతి.. శ్రీకాకుళం జిల్లాకు ధర్మాన ప్రసాదరావు వల్లే చాలా పేరు వచ్చిందన్నారు. అక్కడితో ఆగకుండా… మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు టక్కున ఓ కామెంట్ పాస్ చేశారు. ఈ వ్యాఖ్యలు పుస్తకావిష్కరణ సభలోనే కాకుండా జిల్లా రాజకీయాల్లోనూ చర్చగా మారాయి. వైసీపీ వర్గాల్లో అయితే లక్ష్మీపార్వతి మాటలే హాట్ టాపిక్.
సిక్కోలు వైసీపీలో లక్ష్మీపార్వతి వ్యాఖ్యలతో కలకలం!
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రసాదరావు ఆశించారు. కానీ.. అనూహ్యంగా ఆయన సోదరుడు కృష్ణదాస్‌ను మంత్రి పదవి వరించింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళనకు సమయం దగ్గర పడుతుండటంతో మంత్రి అయ్యేందుకు జిల్లా నుంచి పలువురు పోటీ పడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నట్టు టాక్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రసాదరావును ఉద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన కామెంట్.. జిల్లా వైసీపీ వర్గాల్లో బాంబు పేల్చినంత పనైందట.
లక్ష్మీ పార్వతి మాటల వెనక మరేదైనా కారణం ఉందా?
లక్ష్మీపార్వతి కాకతాళీయంగా మాట్లాడడారా.. లేక ఆమె మాటల వెనక మరేదైనా కారణం ఉందా అని అధికార పార్టీ నేతలు.. శ్రేణులు చర్చించుకుంటున్నారట. పుస్తకావిష్కరణ సభకు వచ్చి.. ఆ ప్రోగ్రామ్‌కే పరిమితం కాకుండా.. రాజకీయాలు మాట్లాడటం దేనికి అన్నవారూ లేకపోలేదు. చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చి భలే టెన్షన్ పెట్టారని ఎవరికి వారు చెవులు కొరుక్కుంటున్నారట. దీంతో రానున్న రోజుల్లో లక్ష్మీపార్వతి కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో కొత్త చిచ్చు పెట్టేలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.