కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందువాదిని కాదని అన్నారు. జైపూర్‌లో మెహంగాయ్ హటావో మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందు, హిందూత్వ అనే రెండు పదాల మధ్య దేశ రాజకీయాల్లో ఘర్షణ జరుగుతున్నదని రెండింటి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. హిందువు అంటే సత్యం అని, సత్యం కోసం శోధించేవాడని, సత్యాగ్రహం అని, హిందుత్వ అంటే అధికారం కోసం శోధిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
Read: దేశంలో ఒమిక్రాన్ టెన్షన్… 36 కి చేరిన కేసులు…
గాంధీ హిందువు అని, గాడ్సే హిందుత్వవాది అన్నారు. దేశం హిందువులదని, హిందుత్వవాదులది కాదని అన్నారు. దేశంలో ఒక శాతం జనాభా చేతిలో 33 శాతం సంపద, 10 శాతం మంది చేతిలో 65 శాతం సంపద ఉంటే, దేశంలోని 50 శాతం పేదల చేతిలో కేవలం 6 శాతం సంపద మాత్రమే ఉందని అన్నారు. 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారని, 70 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన వాటికి ఏడేళ్ల కాలంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్నారని రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు.