కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో కోసం అంబులెన్స్ వెనుక వేలాదిమంది అభిమానులు ఫాలో అయ్యారు. అభిమానుల ఆందోళన దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ కూడా ప్రకటించింది. థియేటర్లను కూడా మూసివేయాలని ఆదేశించింది.
Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను దానం చేసిన పునీత్
పునీత్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంఠీరవ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఆయన తండ్రి రాజ్‌కుమార్ సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు కూడా జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ లాంఛనాలను ప్రభుత్వం తరఫున నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.