ఉరుకుల పరుగుల హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి కొంచెం కష్టమే. అయితే ఉదయాన్నే పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా లాంటివి చేయడానికి ఉస్మానియా యూనివర్సీటీ పరిసరాల ప్రజలు ఓయూ క్యాంపస్‌ను వినియోగించుకుంటుంటారు. అయితే ఇలా తార్నాక, డీడీ కాలనీ, విద్యా నగర్, మాణికేశ్వర్ నగర్, అడిక్‌మెట్, హబ్సిగూడ, అంబర్‌పేట్‌తో సహా ఓయూ పరిసర ప్రాంతాల నుండి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్‌లో వాకింగ్, రన్నింగ్, జాగింగ్‌తో పాటు యోగా వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు.
Also Read : కొత్త వేరియంట్‌పై అధ్యయనం చేస్తున్నాం : ఐసీఎంఆర్
అయితే ఇప్పటివరకు ఓయూ క్యాంపస్‌లో జాగింగ్, వాకింగ్ లాంటివి చేసేందుకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇక నుంచి ఓయూ క్యాంపస్‌లో జాగింగ్, రన్నింగ్, యోగా లాంటి ఫిట్‌నెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఛార్జీలు చెల్లించాల్సిందే అంటున్నారు ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.రవీందర్. అయితే వాకర్స్‌పై నెలవారీ ఛార్జీలు విధించడానికి విశ్వవిద్యాలయం ఇంతకు ముందే ప్రణాళికలు వేసింది.
వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాలనా యంత్రాంగం ప్రణాళికలను నిలుపుదల చేయాల్సి వచ్చింది. ఆసక్తికరంగా ఇప్పుడు క్యాంపస్‌లో తమకు మెరుగైన సౌకర్యాల కావాలంటూ బదులుగా వాకర్లే ఇప్పుడు యూజర్ ఛార్జీలు విధించాలని సూచించారని ప్రొఫెసర్ ఆర్.రవీందర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ఓయూలో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయాలంటే ఛార్జీ రూ.200లు చెల్లించాల్సిందేనని ఆయన తెలిపారు.