తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు.
లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబయ్ లో చేరినప్పటి నుంచే లావణ్యకు ‘షో బిజ్’లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనువుగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా “సిఐడి, ప్యార్ కా బంధన్” వంటి టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ కు పరిచయమయింది. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది. దాంతో వరుసగా అవకాశాలు లభించాయి. “బ్రమ్మన్, మాయవాన్” అనే తమిళ చిత్రాలలో నటించింది. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే లావణ్య తళుక్కుమంది.
లావణ్య నటించిన “దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 కెఎమ్.పి.హెచ్, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా” చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునే సంపాదించి పెట్టాయి. నాగార్జున సరసన లావణ్య నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఘనవిజయం సాధించింది. అలాగే నాని జోడీగా ఆమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. రితేష్ రానా తెరకెక్కించే క్రైమ్ కామెడీలో లావణ్య నటిస్తోంది. మునుముందు లావణ్య ఏ తరహా పాత్రలతో జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.