వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లు ఉన్నాయి. అయితే, ముందస్తు సర్వే గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో మరోసారి కాషాయం పార్టీకి పట్టంగట్టే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీలో ప్రక్షాళన చేసింది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్‌ను కొనసాగిస్తూనే పార్టీ పగ్గాలను మాత్రం సిద్దూకు అప్పగించింది. ఇకపోతే, పంజాబ్‌లో ఎలాగైనా ఈసారి పాగా వేయాలని ఆప్ చూస్తున్నది. ఇందులోభాగంగానే ఆ పార్టీ ఇప్పటికే కొన్ని వరాలను ప్రకటించింది. ఢిల్లీలో వర్కౌట్ అయిన ఉచిత విద్యుత్ పథకాన్ని పంజాబ్‌లో కూడా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ స్వయంగా చండీగడ్ వెళ్లి ఉచిత విద్యుత్ పథకం గురించి అనౌన్స్ చేశారు. అటు, ఉత్తరాఖండ్ పై కూడా ఆ పార్టీ కన్నేసింది. ఉత్తరాఖండ్‌లో కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆప్ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకున్నా అది ఆప్‌కు ప్లస్ అవుతుందని చెప్పాలి. జాతీయపార్టీగా చలామణి కావాలి అంటే పార్టీని విస్తరించుకోవడం ఒక్కటే మార్గం. పోటాపోటీ పొత్తులతో పెద్దగా సాధించలేమని ఆప్‌కు తెలుసు. అందుకే పార్టీని విస్తరించుకోవడానికి ఆప్ ప్రాధాన్యత ఇస్తోంది.