స్వచ్ఛాంధ్ర, బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు – మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. కాగా, బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారన్నారు. వారి హత్యలపై విచారణ వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఇదే అంశం మ్యానిఫెస్టోలో కూడా పెట్టమని ఆయన తెలిపారు. దీంతో పాటు బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు వెంటనే చెల్లించండి అని తెలిపారు. నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ స్కూళ్లను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. అయితే, వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. కాగా, ఏసీఎంఎం కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం విజయవాడలోని సబ్ జైలులో ఉన్నారు.
ఏపీలో జీపీఎస్ వైరస్ కేసులు నమోదు.. మంత్రి కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆరు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదు అయినట్టు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులను గుర్తించారు. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి సోకుతుంది. రోగనిరోధక శక్తిని నశింప చేసేలా జీబీఎస్ సిండ్రోమ్ పని చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఇక, అతిగా ఇన్ఫెక్షన్లు, వాక్సిన్‌లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కండరాల బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవటం, మింగలేకపోవటం, శ్వాస ఆడకపోవటం లాంటి లక్షణాలతో జీబీఎస్ వ్యాధి లక్షణాలుగా సూచించారు. ఇంట్రా వీనస్ ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ పేర్కొనింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్ కుల గణన సర్వేలో భాగస్వామ్యం కావాలి..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కుల గణన పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంచాలని రాహుల్ గాంధీ ఆలోచన అని అన్నారు. ప్రణాళిక బద్దంగా సమగ్ర కుల సర్వే సంపూర్ణంగా జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ప్రభుత్వం అంటే పన్నులు వసూలు చేసి.. పాలించడం కాదు. దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు కాంగ్రెస్ తెచ్చిన చట్టాల వల్లనే జరిగాయని అన్నారు. చిన్న పొరపాటు లేకుండా.. ఎవరు వేలెత్తి చూపకుండా పక్కగా కుల సర్వే చేపట్టామని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457. సర్వే లో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134. సర్వే లో పాల్గొనని కుటుంబాలు 3,56,323 (3.01శాతం). సర్వే విజయవంతంగా కాకూడదని అనుకున్న కేసిఆర్, కేటీఆర్ సర్వే లో పాల్గొన లేదు. కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న రాష్ట్ర ప్రజలు 3కోట్ల 70 లక్షల మంది అని వివరాలు వెల్లడించారు.
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీఓ శ్యామ్ సుందర్..
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్ మేనేజర్ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకోవాలని పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సూచించాడు. అయితే వెంచర్ మేనేజర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో పంచాయతీ సెక్రటరీ అడ్డంగా దొరికిపోయాడు. డీపీవో సూచన మేరకు రూ. 2లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఉన్న పలంగా పట్టుకున్నారు.
అమెరికా టూర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోడీ
ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్‌తో సహా పలువురు కీలక నేతలను మోడీ కలిశారు. ఇక ట్రంప్ అయితే మోడీని కౌగిలించుకుని ఆహ్వానం పలికారు. ఇందుకు సంబంధించిన అమెరికా పర్యటన విశేషాలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంధనం నుంచి విద్య వరకు.. వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు.. ఏఐ నుంచి అంతరిక్షం వరకు అనేక అంశాలను చర్చించినట్లు మోడీ పోస్టులో పేర్కొన్నారు. ఇక అమెరికా పర్యటన చాలా ఫలవంతంగా జరిగిందని మోడీ స్పష్టం చేశారు. మోడీ సోషల్ మీడియాలో 3:45 నిమిషాల వీడియోను పోస్టు చేశారు. అందులో వాషింగ్టన్ పర్యటనలోని కీలక క్షణాలు గుర్తుచేశారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు తీవ్ర అస్వస్థత.. రోమ్ ఆస్పత్రికి తరలింపు
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలుమార్లు కిందపడి పోవడంతో గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా రోమ్ ఆస్పత్రికి తరలించారు. రెగ్యులర్ పరీక్షలు మరియు బ్రోన్కైటిస్ చికిత్స కోసం పోప్ ఫ్రానిస్ ఆస్పత్రిలో చేరారని వాటికన్ సిటీ శుక్రవారం ధృవీకరించింది. ఫిబ్రవరి 6న పోప్ ఫ్రాన్సిస్‌కు బ్రోన్కైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినా కూడా ఆయన నివాసమైన కాసా శాంటా మార్టాలో విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆదివారం యథావిధిగా ప్రార్థన కార్యక్రమాలకు అధ్యక్షత వహించారని వాటికన్ తెలిపింది. పోప్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యవ్వనంలో ఉండగా ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించారు.
బోర్డు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మెట్రో ఏం ఏర్పాట్లు చేసిందంటే..!
దేశ వ్యాప్తంగా త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు. మరో వైపు పరీక్షల కోసం ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ నుంచి ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని కోరింది. హాల్ టికెట్లు చూపించి.. భద్రతా తనిఖీలు లేకుండానే వెళ్లే వసతిని మెట్రో కలిపించింది. త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేసింది. టికెట్ ఆఫీస్ మెషీన్స్, కస్టమర్ కేర్ కేంద్రాల్లో హాల్ టికెట్లు చూపిస్తే.. వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. దీంతో త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరవచ్చని తెలిపింది.
వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘ఓ భామ అయ్యో రామ’ పోస్టర్ విడుదల..
ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్. ఈ సినిమాలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే.. జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’. హరీశ్ నల్ల నిర్మాత. అనిత హస్సానందాని, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతడికి తొలి సినిమా. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. తాజాగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఓ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్‌ను చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ జంట అందించే ప్రేమకథ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
RX100 దర్శకుడి చేతుల మీదుగా..”నా లవ్ స్టోరీ” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నా లవ్ స్టోరీ” ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ చిత్రానికి వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు ఈ సందర్భంగా అజయ్ భూపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నేను, వినయ్ గోను రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్స్ గా పని చేశాం ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ చాలా యూనిక్ గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.” అని పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసిన దర్శకుడు అజయ్ భూపతికి వినయ్ గోను ధన్యవాదాలు తెలిపారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు వెల్లడించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న మోహిత్ పెద్దాడ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.