వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. నేతలకు జగన్ దిశానిర్దేశం..
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు.. మొన్న ప్రెస్‌మీట్‌లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను.. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం అవకాశం ఇస్తే.. నిశితంగా సభలో చెప్పగలుగుతాం.. లేదు, ఇవ్వం, రెండే రెండు నిమిషాలు ఇస్తామంటే.. ఇక మాట్లాడేది ఏముంటుంది..? అని ప్రశ్నించారు జగన్.. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే.. ఇంకేం మాట్లాడగలం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే.. అందులో మూడు పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైయస్సార్‌సీపీ మాత్రమే. మిర అలాంటి రాజకీయ పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది.. అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం వస్తుంది.. కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు.. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మేం మాట్లాడుతున్నాం అన్నారు జగన్.
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి..
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు.. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా.. సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు. ఈ చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్టీలో రెండు స్లాబ్ ల వల్ల తగ్గుతున్నాయని వెల్లడించారు.. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ప్రజలకు జీఎస్టీ అర్థం కావాలి.. ఈసారి పండుగలన్నీ ఆనందంగా..!
రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే, రిఫామ్స్ అంటే నేను ముందుంటాను. ఎలాంటి రిఫామ్స్ అయినా ముందుకే.. అభివృద్ధి జరిగితే సంపద వస్తుందని తెలిపారు.. ఇది వరకు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం కేటగిరీలో ఫోర్ ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. అనేక రకాలుగా కాంప్లికేషన్ లు ఉండేవి. 140 కోట్ల మందికి కొత్తగా తెచ్చిన 5 శాతం, 18 శాతం ట్యాక్స్ వల్ల లాభం కలుగుతుందని వివరించారు. దసరా.. దీపావళి ఘనంగా చేసుకోడానికి పేదవారికి అవకాశం ఉంటుంది.. గణనీయంగా ట్యాక్స్ తగ్గుతుందన్నారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంపద. సంక్షేమం వస్తాయి.. టాక్స్.. రిఫామ్స్ అంటే కొందరు వెనకడుగు వేస్తారు.. వన్ నేషన్.. వన్ విజన్ తో ముందుకు వెళ్లాలి.. ప్రపంచంలో డబుల్ డిజిట్ గ్రోత్ గా భారత్ ఉంటుందన్నారు.. జీఎస్టీ రెండో తరం సంస్కరణలు మోడీ తీసుకువచ్చారు.. నిత్యావసర వస్తువులు మిల్క్, పన్నీర్, పెరుగు 5 శాతం తగ్గాయి.. కామన్ మాన్ కు ఉపయోగ పడేవి అన్ని తగ్గుతాయన్నారు.. దేశంలోనే తొలిసారి జీఎస్టీ 2.0 సంస్కరణలపై తీర్మానంపై చర్చించింది ఏపీ శాసనసభ.. గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది. 17 రకాల పన్నులు , 13 రకాల సెస్సులు, సర్‌ఛార్జీలు ఉండేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చింది.. రెండు శ్లాబులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారని తెలిపారు చంద్రబాబు.
అప్పట్లో సీఐ చేతిలో చెంపదెబ్బ.. ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన నేత..
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేరుగా కాళహస్తికి వెళ్లి సాయిని పరామర్శించారు.. అక్కడ నుండి ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని స్వయంగా అంజు యాదవ్ పై ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్.. అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీకి ఆ సమయంలో వెన్నుదన్నుగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త అయిన కొట్టే సాయికి.. మంచి పోస్ట్ ఇచ్చారు.. ఏకంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్.. దీంతో సాయిని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి వరించింది.. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది..
పండుగ ప్రయాణం ఇక సులభం.. దసరాకు ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్..
దసరా , బతుకమ్మ పండుగల సీజన్ సమీపిస్తుండటంతో, సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ఈ చర్యలు చేపట్టింది. ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సులభతరం చేయడానికి, టీజీఎస్ఆర్టీసీ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఏకంగా 7,754 స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ బస్సులలో, 377 సర్వీసులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, తద్వారా కౌంటర్ల వద్ద నిరీక్షణ తప్పించుకోవచ్చు. సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30), దసరా (అక్టోబర్ 2) రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయి. అలాగే, పండుగలు ముగిసిన తర్వాత తిరిగి నగరానికి వచ్చేవారి సౌకర్యార్థం అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదనపు ఛార్జీలు లేకుండానే సాధారణ బస్సుల టికెట్ ధరలకే ఈ సేవలు లభ్యం అవుతాయి. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఊరెళ్లే ప్రయాణికులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని బస్టాండ్‌లో విచారించవచ్చు.
కుటుంబం నుంచి విడిపోవాలని భర్తపై భార్య ఒత్తిడి.. హైకోర్టు సంచలన తీర్పు..
తన భర్తని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వానికి సమానమని, ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పదే పదే బహిరంగంగా అవమానించడం, భాగస్వామిని తిట్టడం మానసిక క్రూరత్వమే అని హైకోర్టు పేర్కొంది. ‘‘ విడిగా జీవించాలనే కోరిక క్రూరత్వం కిందకు రాకపోయినా, భర్తను తన కుటుంబంతో సంబంధాలు తెంచుకోవాలని నిరంతరం వేధించడం ఖచ్చితంగా క్రూరత్వమే అవుతుంది. భర్తను తల్లిదండ్రుల నుంచి దూరంగా చేయడానికి భార్య నిరంతరం ప్రయత్నించడం మానసిక క్రూరత్వం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది’’ అని జస్టిస్ జస్టిస్ అనిల్ క్షేత్రర్‌పాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 16న తీర్పు వెలువరించింది.
“నెపోటిజం” లేనిది ఒక్క సైన్యం లోనే: డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం(బంధుప్రీతి) లేని ఏకైక ప్రదేశం సైన్యం మాత్రమే అని చెప్పారు. దేశానికి సేవ చేయడానికి, వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి సాయుధ దళాల్లో చేరాలని పిల్లలను కోరారు. రాంచీలోని పాఠశాల పిల్లలతో మాట్లాడిన ఆయన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని కాపాడేందుకు సాయుధ దళాలు ఈ ఏడాది చాలా ప్రయత్నాలు చేశాయని చెప్పారు. “బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘ఫౌజ్’ (సైన్యం)… మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, దేశాన్ని, ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే మీరు సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షించాలి” అని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి మే 7 తెల్లవారుజామున 1 గంటలకు మొదటి దాడి నిర్వహించినట్లు ఆయన చెప్పారు. రాత్రిపూట సుదూర ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులకు ప్రత్యేక ప్రయత్నాలు అవసరం అని అన్నారు.
పక్క రాష్ట్రంలో.. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని..
భారత దేశంలో బంగారు గనులు ఉన్నాయని, అవి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని మాత్రమే ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇప్పటి నుంచి చరిత్ర మారబోతుంది. దేశంలో మొట్ట మొదటిసారి బంగారు గనులను ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకోబోతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అది మరెక్కడో కాదు.. మన పక్క రాష్ట్రంలోనే. ఈ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ గనిని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వహించనుంది. భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద ప్రైవేట్ బంగారు గని త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుందని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఉన్నతాధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం ప్రస్తుతం ఏటా 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని మీకు తెలుసా. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇండియా చమురు తర్వాత దిగుమతి చేసుకునేది బంగారాన్ని. అయితే ఈ గని ప్రారంభమైన తర్వాత భారత్ బంగారం దిగుమతులపై ఆధారపడటం కచ్చితంగా తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
38 గంటల ప్లేబ్యాక్, వాయిస్ నోట్స్ రికార్డింగ్, ఆటో ట్రాన్స్‌క్రిప్షన్ సపోర్ట్‌తో Nothing Ear 3 లాంచ్.. ధర ఎంతంటే?
నథింగ్ (Nothing) కంపెనీ తమ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ 3 (Nothing Ear 3)ను కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఛార్జింగ్ కేస్‌లో “సూపర్ మైక్” అనే వినూత్న ఫీచర్‌తో వస్తుంది. ఇది 95dB వరకు శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్ కాల్స్‌కు సహాయపడుతుంది. కేస్‌పై ఉన్న ‘టాక్’ బటన్ నొక్కి దీనిని వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌తో కేస్ నుంచే వాయిస్ నోట్స్ రికార్డ్ చేయవచ్చు. అవి నథింగ్ ఓఎస్ ఉన్న ఫోన్‌లలో ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రైబ్ అయ్యి టెక్స్ట్‌గా మారుతాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు 45dB వరకు రియల్ టైమ్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 38 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..
బిగ్ బాస్ లో రోజురోజుకూ పిచ్చి పనులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. టాస్కుల పేరుతో చిన్న, పెద్ద అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెట్టేసుకోవడం, కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. చూసే వాళ్లకు ఎంత చిరాకు లేసినా.. చూడక తప్పదనుకోండి. అదే బిగ్ బాస్ మాయ. ఇక తాజాగా కామనర్స్ కు, సెలబ్రిటీలకు కలిసి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముందు ఓ చక్రాన్ని పెట్టాడు. అది తిరుగుతూ ఉంటుంది. రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక చేతితో దాన్ని పట్టుకోవాలి. ఈ చక్రం తిరుగుతున్న టైమ్ లో బిగ్ బాస్ వాళ్లకు కొన్ని టాస్కులు ఇస్తాడు. అది కంప్లీట్ చేసిన వారికి ఒక గంట టైమ్ పెరుగుతుంది. చక్రం ఆగిపోయే టైమ్ లో ఏ టీమ్ కు ఎక్కువ టైమ్ ఉంటే వారే విన్నర్. అయితే ఈ చక్రాన్ని పట్టుకున్న వారిలో ఎవరినైనా ఈజీగా తప్పించొచ్చు. అవతలి టీమ్ వాళ్లను తప్పించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే దీన్నే కామనర్ డిమాన్ పవన్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఈ గేమ్ లో సుమన్ శెట్టి చివరి దాకా బాగా ఆడాడు. కానీ చివర్లో డిమాన్ పవన్ సుమన్ ను మెడ పట్టుకుని లాగేశాడు. అయినా సుమన్ కింద పడలేదు. దీంతో కాలు పట్టుకుని లాగి పడేశాడు పవన్. దీంతో సుమన్ పల్టీలు కొడుతూ దారుణంగా కింద పడ్డాడు. ఇది చూసిన ప్రేక్షకులు పవన్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. ఆడటం చేతకాక.. వయసులో పెద్దోడు అని కూడా చూడకుండా కింద పడేస్తాడా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
బయట వర్షం.. లోపల సెగలు.. సింగిల్ గా ఉన్నానంటూ నటి షాకింగ్ ఫొటోస్
ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో కనిపించిన గాయత్రీ గుప్త గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయకపోయినా సోషల్ మీడియాలో తనదైన శైలిలో కామెంట్లు పెడుతూ పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టింది. అందులో ఆమె తాను ఇప్పుడు ఓవులేటింగ్ లో ఉన్నానని, మరోపక్క వర్షం పడుతుందని, కానీ సింగిల్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు దీని కోసమైనా పరితపించడమే అమేజింగ్ గా ఉంటుందంటూ ఆమె రాసుకొచ్చింది. ఏదైనా ఈజీగా దొరికేయడం కంటే డెస్పరేషన్ ఉంటేనే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందంటూ ఆమె రాసుకొచ్చింది. ఒకరకంగా ఇది బోల్డ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ కి కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నేటిజెన్లు. కొంతమంది ఆమె బోల్డ్‌నెస్ కి ఇంప్రెస్ అవుతుంటే కొంతమంది మాత్రం ఇలా బరితెగించావ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తేజ సజ్జా మరో అరుదైన ఫీట్
ఇటీవల మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో ఐఎండిపీకి గాను ఇండియా వైడ్ 9వ స్థానానికి ఎగబాకాడు. గత వారం తేజ 160వ స్థానంలో ఉన్నాడు కానీ ఈ వారం మిరాయ్ రిలీజ్ నేపథ్యంలో తేజ సజ్జా ఏకంగా తొమ్మిదో స్థానానికి రావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో సయారా హీరో అహన్ పాండే మూడో ప్లేస్ లో అనీత్ పడ్డ నిలిచారు. ఈ వారం నెట్ఫ్లిక్స్ లో సయారా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వారు ఒక్కసారిగా తెరమీదకు వచ్చినట్లు అయింది. ఇక మరో పక్క అక్షయ్ కుమార్ కి ఈ లిస్టులో ఆరవ స్థానం దక్కింది. జాలి ఎల్.ఎల్.బి 3 ప్రమోషన్స్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కి ఆ స్థానం దక్కింది. ఇక తేజ మిరాయ్ సినిమా విషయానికి వస్తే కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించారు. సుమారు 60 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన ఈ సినిమా తెలుగు సహా పాన్ ఇండియా భాషలతో పాటు చైనీస్, జపనీస్ వంటి భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ 100 కోట్ల కలెక్షన్లు దాటి మరింత ముందుకు దూసుకు వెళ్తోంది.