కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.. అయితే, నేరుగా బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ స్థానిక లీడర్‌కు ఫోన్ చేసిన ఆయన.. బాధితురాలి దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఆమెతో మాట్లాడారు.. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులకు వదిలిపెట్టనని.. తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు చంద్రబాబు.. మరో మారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం అన్నారు.. దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ ఎంతటి వారైనా వదలను అని హెచ్చరించారు చంద్రబాబు.. మరోసారి డబ్బుల కోసం ఎవరు మహిళ జోలికి రాకూడదు… వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు.. మానవత్వం లేకుండా ఒక దుర్మార్గుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించారు.. వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. పెద్ద పాపను స్కూల్‌లో చేర్పించాలని, మరో ఇద్దరు పిల్లల్ని చదివించాలని సీఎం చంద్రబాబును కోరారు బాధిత మహిళ.. వెంటనే పెద్ద అమ్మాయిని హాస్టల్ చేర్పిస్తామని, ఇద్దరు పిల్లల చదువుతో పాటు, ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు సీఎం.. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ బాధిత మహిళలకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
రేపు పల్నాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు..!
రేపు పల్నాడు జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వెళ్లనున్నారు జగన్.. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చేరుకుంటారు.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.. అయితే, పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సత్తెనపల్లిలో జగన్ పర్యటించి తీరుతారని స్పష్టం చేశారు వైసీపీ నేతలు.. దీంతో, వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు, రేపు జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు..
లిక్కర్ కేసులో కొత్తగా ఆరుగురు నిందితులు.. చెవిరెడ్డి అరెస్ట్..?
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది.. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును FIRలో చేర్చింది సిట్.. A 38గా చేవిరెడ్డి పేరును పేర్కొంది.. ఈ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు.. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ను ఈ కేసులో A 34గా చేర్చింది.. మరోవైపు, ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.. చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో.. ఏపీ డీజీపీకి సమాచారం పంపించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అయితే, ఏపీ పోలీసుల సూచన మేరకు ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ కు చెవిరెడ్డిని తరలించారు అధికారులు.. ఈ రోజు రాత్రికి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకోనున్న సిట్ బృందం.. రేపు చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చూపనుంది. ఇక, లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య పెరిగింది.. కొత్తగా ఆరుగురు నిందితులను చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్.. దీంతో, ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల మొత్తం సంఖ్య 39కి చేరింది.. ఏ34 గా వెంకటేశ్ నాయుడు.. ఏ38గా చెవిరెడ్డి పేర్లను ప్రస్తావించారు.. సిట్ కొత్తగా చేర్చిన నిందితుల వివరాలను పరిశీలిస్తే.. ఏ34గా వెంకటేష్ నాయుడు, ఏ35గా బాలాజీ కుమార్, ఏ36గా నవీన్, ఏ37గా హరీష్, ఏ38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లను చేర్చారు సిట్ అధికారులు..
అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం.. సర్కార్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానున్నట్టు పేర్కొంది.. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశం చేశారు.. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘సర్క్యులర్ ఎకానమీ’పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ సాగింది..
మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా..? నిలదీసిన జగన్..
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే అంటూ దుయ్యబట్టారు జగన్.. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు.. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు.. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి అని ట్వీట్‌చేశారు జగన్.. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయం.. మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు, ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలి.. చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్..
గో సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (జూన్ 17న) సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన చేయాలని అభిప్రాయపడ్డారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని.. స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వ విద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో మొదట గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్పై విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే, బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు ఆయన చేర వేసినట్లు తేలింది. దీంతో బీజేపీ నేతల నియోజక వర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు భుజంగరావు సమాచారం ఇచ్చే వారని సిట్ అధికారులు గుర్తించారు.
రేపటి నుంచే తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్.. అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించండి..!
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరగనుండగా.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు కొనసాగనుంది. సుమారు తొమ్మిది రోజుల పాటు 16 సెషన్‌లలో పరీక్షలు జరగనున్నాయి. 15 జిల్లాల్లో 66 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్షలకు 1, 83, 653 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
‘‘ఒకప్పుడు మంచి మిత్రులు, ఇప్పుడు బద్ధ శత్రువులు’’.. ఇజ్రాయిల్-ఇరాన్ శత్రుత్వానికి కారణం ఇదే..
ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ప్రపంచం భయపడుతోంది. శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది. ప్రతిగా, ఇరాన్, ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలపై వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్‌లో 200 మందికి పైగా మరణించగా, ఇజ్రాయిల్‌లో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ రెండు దేశాలు ఒకప్పుడు మంచి మిత్రులని చాలా మందికి తెలియదు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు, చాలా ముస్లిం మెజారిటీ పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయిల్‌ని గుర్తించేందుకు నిరాకరించాయి. అయితే, షియా ముస్లిం-మెజారిటీ కలిగిన ఇరాన్‌తో పాటు టర్కీలు ఇజ్రాయిల్‌ని గుర్తించాయి. దీనికి ఒక కారణం ఈ రెండు దేశాలకు అమెరికాతో సంబంధాలు ఉండటం. ఆ సమయంలో ఇరాన్‌ని షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలిస్తుండేవారు. కోల్డ్ వార్ సమయంలో అమెరికాకు ఇరాన్ కీలక మిత్రదేశంగా ఉండేది. ఆ తర్వాత రెండు దశాబ్దాలు మాజీ ఇజ్రాయిల్ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ తన ‘‘పెరిఫెరీ డ్రాక్ట్రిన్’’ ద్వారా అరబ్ యేతర దేశాలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇరాన్, టర్కీ, ఇథియోపియాతో ఇజ్రాయిల్‌కి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకానొక సమయంలో ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొసాద్, ఇరాన్ సావక్ మధ్య ఆయుధాల అమ్మకాలు, నిఘా భాగస్వామ్యం పెంచుకోవాలని భావించాయి. ఇజ్రాయిల్ కు అరబ్ దేశాలతో జరిగిన ‘‘6-డే వార్’’ తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయిల్‌కి చమురు సరఫరా చేసింది. ఇరాన్‌లో వాణిజ్యం, మౌలిక సదుపాయాలకు ఇజ్రాయిల్ మద్దతు ఇచ్చింది.
ఒక్కసారి ఛార్జింగ్ తో 127 కి.మీ. రేంజ్.. కొత్త EV చేతక్ 3001 విడుదల..!
బజాజ్ ఆటో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 (Bajaj Chetak 3001)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ కొత్త మోడల్ పూర్తిగా కొత్త EV ఆర్కిటెక్చర్ పై రూపొందించబడింది. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దామా.. చేతక్ 3001 స్కూటర్ లో ఫ్లోర్ బోర్డ్ మౌంటెడ్ 3.0 kWh బ్యాటరీ ఇవ్వబడింది. అలాగే ఈ స్కూటర్ ఒకవైపు ప్రయాణికులకు మంచి సౌలభ్యం కలిగించడమే కాకుండా, 35 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ తో మార్కెట్‌లో అత్యుత్తమ ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. చేతక్ 3001 స్కూటర్ కు 127 కి.మీ. రేంజ్ లభిస్తుంది. దీని ద్వారా రోజువారీ ప్రయాణాలే కాకుండా, చిన్న వారాంతపు ట్రిప్ లకు కూడా ఇది చక్కగా సరిపోతుంది. బజాజ్ అందిస్తున్న 750 W ఛార్జర్ ద్వారా 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని 3 గంటల 50 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఈ సెగ్మెంట్‌లో వేగంగా ఛార్జ్ అయ్యే స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది.
అందుకే ధనుష్ అంటే టెన్షన్.. శేఖర్ కమ్ముల కామెంట్స్
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచేసింది. ఇందులో ధనుష్ నటించడంపై శేఖర్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మూవీ జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా శేఖర్ కమ్ముల, నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ధనుష్ ను ఈ సినిమాలోకి తీసుకున్నప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయన యాక్టర్ మాత్రమే కాదు. మంచి డైరెక్టర్ కూడా. లిరిక్స్ రాస్తారు. ఒకవేళ రెండో టేక్ తీసుకుందామంటే ఏమనుకుంటాడో అనుకునే వాడిని. కానీ ధనుష్ నా అంచనాలను తప్పు చేశాడు. ఒక్క టేక్ లోనే కంప్లీట్ చేసేవాడు. అదే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. నాగార్జునతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి ఇందులో ఇద్దరం కలిసి హాయిగా చేసేశాం. ఎలాంటి ఇబ్బంది పడలేదు. కాకపోతే ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకున్నా. మూవీ ఔట్ పుట్ బాగా వచ్చింది. ఇది సరికొత్తగా ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటిది మీరు చూసి ఉండదు. ముంబై ప్రాంతంతో ఇది ముడిపడి ఉంటుంది. కానీ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా తీశా అంటూ తెలిపారు శేఖర్.
విలన్ పాత్రల్లో నాగార్జున.. రాంగ్ రూట్ ఎంచుకున్నాడా..?
కింగ్ నాగార్జునకు మంచి మార్కెట్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన ఇద్దరు కుమారుల కంటే ఆయన సినిమాలకే మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు ఏ మాత్రం కనిపించకుండా మేనేజ్ చేస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకు నెగెటివ్ రోల్స్ చేయలేదు. సొంతంగానే సినిమాలను నిర్మించుకోగలరు. అలాంటి నాగార్జునకు సడెన్ గా ఏమైంది. ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నాడు. హీరోగా మంచి సినిమాలు చేసుకునే నాగ్.. విలన్ పాత్రలపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు ఆయన అభిమానులకు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు. ఆయనకు ఏం తక్కువ అంటున్నారు ఫ్యాన్స్. ఆయన ఫేడవుట్ అయిపోలేదు. మార్కెట్ పడిపోలేదు. అక్కినేని అభిమానుల సపోర్ట్ ఫుల్ గా ఉంది. టాలీవుడ్ ను శాసించిన కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఉంది. మరి నాగ్ కు ఏమైంది.