ఏపీలో మరోసారి ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వచ్చింది ప్రభుత్వం.. ఇక, పాలనపై పట్టు కోసం.. సమర్థవంతమైన పాలన కొనసాగించేందుకు.. సుదీర్ఘకాలం పాటు అధికారులు ఒకే దగ్గర ఉండే విధంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ మధ్య పెద్ద స్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు.. భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశారు.. అయితే, మరోసారి ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్‌ను నియమించింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది ఏపీ సర్కార్.. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా అదనపు బాధ్యతలతో పాటు డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు విడుదల చేశారు..
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక తీర్పు.. స్వాగతించిన మంత్రి ఎన్ఎండీ ఫరూక్
వక్ఫ్ సవరణ చట్టం-2025 పై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ చట్టంలోని ముఖ్యమైన ప్రొవిజన్ ను నిలిపివేసింది. అయితే, మొత్తంగా చట్టంపై స్టే విధించాలంటూ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, వక్ఫ్ చట్టంపై సుప్రీం తీర్పును స్వాగతించారు మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. సీఎం చంద్రబాబు కృషితోనే జేపీసీ దృష్టికి వక్ఫ్ చట్ట సవరణలు వెళ్లాయని.. మూడు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం సవరణలపై ముస్లిం వర్గాలలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని, వారి మనోభావాలకు అనుగుణంగా వక్ఫ్ చట్టంను జేపీసీ దృష్టికి వెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారు.. అప్పుడు జేపీసీ కొన్ని అసమంజస సవరణలను తొలగించగా, నేడు సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పులో మిగిలిన అసమంజస సవరణలపై స్టే విధించిందని వెల్లడించారు.
15 సెప్టెంబర్ ఒక గొప్ప రోజు.. నాకు తృప్తి లభించింది.. జగన్ ఆసక్తికర ట్వీట్..
“ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు.. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది.. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం.. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.” అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్..
జీఎస్టీ తగ్గింపు.. లక్షల్లో దిగివస్తోన్న లగ్జరీ కార్ల ధరలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
జీఎస్టీ శ్లాబులు మారాయి.. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్న పన్ను శ్లాబుల స్థానంలో ఇప్పుడు రెండు కేటగిరీలకు అంటే 5 శాతం, 18 శాతం సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం.. అంటే, 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను పూర్తిగా ఎత్తివేసి.. 5 శాతం, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగిస్తోంది.. మరోవైపు కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును తీసుకొచ్చింది. ఈనెల 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ శ్లాబుల రేట్లు అమలులోకి రానున్నాయి. వీటి ద్వారా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై పన్ను భారం తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.. అంతేకాదు, GST 2.0 కింద లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జీప్ సంస్థల కార్ల ధరలు లక్షల్లో తగ్గనున్నాయి.. సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో కొత్త GST శ్లాబులను ప్రకటించారు. ఈ సమావేశంలో, చిన్న-సెగ్మెంట్ కార్లకు మంత్రిత్వ శాఖ గొప్ప సడలింపును ప్రకటించింది. ఇంతలో, లగ్జరీ కార్లపై 40 శాతం జీఎస్టీ, సెస్ ఛార్జ్ లేదు. ఈ చర్యతో లగ్జరీ కార్ల ధరను కూడా తగ్గించింది, దీంతో, మీ కలల కారును మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఇక, లగ్జరీ కార్ల ధరలు రూ.1.6 లక్షల నుంచి రూ. 30.4 లక్షల వరకు తగ్గనున్నాయి..
రైతులకు గుడ్ న్యూస్.. తీరనున్న యూరియా కష్టాలు
తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్య త్వరలో తీరనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో రాష్ట్రానికి అదనంగా మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన 40 వేల టన్నులకు అదనంగా లభించనుంది. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో యూరియాకు డిమాండ్ పెరిగింది. సరఫరాలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్రానికి అదనపు యూరియా కేటాయించాలని కోరారు. కేంద్రం ఈ విజ్ఞప్తిని వెంటనే మన్నించడంతో, రాష్ట్రానికి మొత్తం ఐదు ఓడల నుండి యూరియా కేటాయింపులు జరిగాయి.
ఆన్‌లైన్ ప్రేమాయణం కోసం భర్తను ఆఫ్‌లైన్‌కు పంపాలనుకుంది..!
ఇంస్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఒక భార్యను ఎంతటి దారుణానికి పాల్పడేలా చేసిందో ఈ ఘటన రుజువు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా, గడ్డి గూడెం తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భర్తను చంపే ఉద్దేశంతో భార్య తన ఇంస్టాగ్రామ్ ప్రియుడితో కలిసి అతడి చెవులు కోసి హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గడ్డి గూడెం తండాకు చెందిన ఓ భర్తపై అతడి భార్య, ఆమె ప్రియుడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి చెవులను కోసి, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. భయంతో ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీసిన ఆ భర్త, వారి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు, పారిపోతున్న ఇంస్టాగ్రామ్ ప్రియుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని ఓ చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన భర్తను వెంటనే మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలతో నిండివున్నాయని, అవి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. సోమవారం కేటీఆర్ తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు డిసెంబర్ 15వ తేదీన విచారణ జరపనుంది. బండి సంజయ్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ బండి సంజయ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
బీహార్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. ఇక్కడ తయారైన రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి..!
సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. బీడీ, బిహార్ ‘బి’తోనే మొదలవుతాయని పేర్కొనడంపై ఇప్పటికే బీజేపీ మండిపడింది. తాజాగా బీడీ-బీహార్ వివాదంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విమర్శలు గుప్పించారు. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా;ఉనలు చేశారు. పూర్ణియాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఓవైపు.. బీహార్ పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు రాష్ట్రాన్ని అవమానించడంలో ప్రతిపక్ష నాయకులు బిజీగా ఉన్నారని అన్నారు. బీహార్‌లో తయారైన రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. కానీ ఇది కాంగ్రెస్, ఆర్‌జేడీ నాయకులకు నచ్చడం లేదన్నారు. ఆర్‌జేడీతో భాగస్వామ్యంతో కాంగ్రెస్, సోషల్ మీడియాలో బీహార్‌ను ఎగతాళి చేయడంలో బిజీగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీడీతో పోల్చడంపై మండిపడ్డారు.
గేమింగ్ యాప్‌లో నేపాల్ ప్రధాని ఎన్నిక.. సుశీలా కర్కీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే!
నేపాల్‌లో చెలరేగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. తాజాగా ఒక కొత్త విషయం బయటికి వచ్చింది. నేపాల్ నిరసనకారులు తమ దేశానికి తాత్కాలిక ప్రధాని ఎన్నుకోవడానికి ఒక గేమింగ్ యాప్‌ను ఉపయోగించారు. అలాగే వాళ్లు సోషల్ మీడియాలో సర్వేలు కూడా నిర్వహించినట్లు సమాచారం. గేమింగ్ యాప్‌లో నిర్వహించిన ఎన్నికల్లో సుశీలా కర్కికి 50 శాతం ఓట్ల వచ్చాయి. కేవలం ఈ ఓట్ల ఆధారంగానే ఆమెను ఎంపిక చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమింటే ఈ ఓట్లు ఎవరు వేశారు అనేది ఎవరికీ తెలియదు. పలు నివేదికల ప్రకారం.. నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా తర్వాత, జనరేషన్-జెడ్ నాయకులు డిస్కార్డ్‌లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుశీలా కార్కితో పాటు, ధరణ్ మేయర్ హర్ద్కా సంపాగ్, మహావీర్ పున్ పేర్లు ఉన్నాయి. డిస్కార్డ్‌పై నిర్వహించిన ఈ పోల్‌లో మొత్తం 7713 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 శాతం ఓట్లు ప్రస్తుత నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీకి అనుకూలంగా వచ్చాయి. రాండమ్ నేపాలీ అనేది రెండవ స్థానంలో ఉంది. రాండమ్ నేపాలీ అంటే నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి అని అర్థం. సాగర్ ధకల్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆయన అనుకూలంగా 1000 మందికి పైగా ఓటు వేశారు. ధరణ్ మేయర్ హర్ద్కా సంపాంగ్ నాల్గవ స్థానంలో, మహావీర్ పున్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ సర్వే ఆధారంగా జనరల్-జెడ్ ప్రతినిధులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌తో సుశీలా కార్కిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమింపజేశారని సమాచారం.
5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఉన్న Maruti Suzuki Victoris ధరలు వచ్చేశాయ్.. రూ.10.50 లక్షల నుండి మొదలు!
మారుతీ సుజికి (Maruti Suzuki) నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీ (SUV) అమ్మకాలు సెప్టెంబర్ 22 నుండి అధికారికంగా మొదలుకానున్నాయి. అయితే, ఇప్పటికే బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీనితో ఇది మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. విక్టోరిస్‌కు భారీ స్పందన లభించిందని పేర్కొన్నారు. కస్టమర్లు దీని ఇంటెలిజెంట్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు, కొత్త డిజైన్, ఆల్-రౌండ్ సేఫ్టీ వంటి వాటిపై ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో విక్టోరిస్ ప్రారంభ ధరను రూ. 10,49,900గా ప్రకటించడం మాకు సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ మంచి పనితీరు, 5-స్టార్ సేఫ్టీ, అత్యాధునిక ఫీచర్లతో నేటి యువతరం ఆశలను తీర్చగలదని ఆయన అన్నారు. ఈ ఎస్‌యూవీ వివిధ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రధాని నరేంద్ర మోడీకి జెర్సీని పంపిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ Lionel Messi..!
దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తన సంతకం చేసిన అర్జెంటీనా 2022 FIFA ప్రపంచకప్ జెర్సీని పంపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సీ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబర్ 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ, మరుసటి రోజు ముంబైకి బయలుదేరతారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో తన పర్యటనను ముగించనున్నారు. అక్కడ ఆయన ప్రధాని మోడీని కలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై మెస్సీ పర్యటన ప్రమోటర్, స్పోర్ట్స్ ఎంట్రప్రెన్యూర్ సతద్రు దత్తా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 75వ పుట్టినరోజుకు మెస్సీ సంతకం చేసిన జెర్సీని పంపారు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. భారత అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో మొదటిసారి పర్యటించి అభిమానులను కలవడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారని అన్నారు.
హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఎవరా రూమర్ గర్ల్‌ఫ్రెండ్
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతో కాకుండా వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. పాండ్యా ప్రస్తుతం టీం ఇండియా తరపున ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా గత ఏడాది నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత, వాళ్లిద్దరూ వారి జీవితాల్లో ముందుకు వెళ్తున్నారు. అనంతరం పాండ్యా భారత సంతతికి చెందిన బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాళ్లు విడిపోయారని సమాచారం. హార్దిక్ జాస్మిన్ వాలియాతో విడిపోయిన తర్వాత పూర్తిగా స్థాయిలో కెరీర్‌పై ఫోకస్ చేశాడు. తాజాగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో టీం ఇండియా తరుపున బరిలో దిగిన హార్దిక్ పాండ్యా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసందర్భంగా పాండ్యాపై కొత్త రూమర్ ఒకటి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం పాండ్యా.. మోడల్, నటి అయిన మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. వారిలో నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారు ఉన్నారు. ఇప్పుడు తేజ కూడా అలాంటి హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ హీరోల సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ. ఒకవేళ హిట్ పడితే ఈజీగా వంద కోట్లు కొల్లగొడుతారు. ఇప్పుడు తేజ అంతకు మించి మిరాయ్ తో దుమ్ములేపాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. నార్త్ లోనూ దుమ్ములేపాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ టైర్-2 హీరోలకు నార్త్ లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తేజ మాత్రం హనుమాన్, మిరాయ్ సినిమాలతో నార్త్ ఇండస్ట్రీలో బలమైన పునాది వేసుకున్నాడు. అక్కడి ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. కాబట్టి ఏ మాత్రం హిట్ వచ్చినా ఇటు సౌత్, అటు నార్త్ లో కలెక్షన్ల పారించే హీరోగా మారిపోయాడు తేజ. మిగతా టైర్-2 హీరోలకు హిట్ పడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వసూళ్ల వర్షం కురిపిస్తారు. తేజ మార్కెట్ నార్త్ లో కూడా పెరగడంతో.. ఓ మెట్టు ఎక్కువే ఉన్నాడు. కానీ దాన్ని కంటిన్యూ చేయగలగాలి. లేదంటే మాత్రం ఆయన ఇమేజ్ మీదకే డ్యామేజ్ జరుగుతుంది. ఇంకొక్క సినిమా ఇలాంటిది పడితే మాత్రం తేజ ఏకంగా స్టార్ హీరోల లిస్టులో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గన్స్ అండ్ రోజెస్ సాంగేసుకున్న పవన్
ఇటీవల ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తుఫాను నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే, ‘గన్స్ ఎన్ రోజెస్’ అనే మరో సంచలన గీతంతో ‘ఓజీ’ చిత్ర బృందం తిరిగి వచ్చింది. ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను ‘ఓజీ’ యొక్క ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళుతుంది. తమన్ తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని సృష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం.. చిత్ర కథ యొక్క తీవ్రత మరియు స్థాయిని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. థమన్ యొక్క అత్యున్నత సంగీత నైపుణ్యం ఈ గీతాన్ని.. ‘ఓజీ’ ప్రపంచం యొక్క నాడి, శక్తి మరియు చీకటిని ప్రతిబింబించే గొప్ప ధ్వని అనుభవంగా మార్చింది. ప్రతి గమనిక, ప్రతి లయ ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ యొక్క అద్భుతమైన విజయం తర్వాత విడుదలైన ఈ ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం.. సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకొని వెళ్ళింది. ఈ గీతం ‘ఓజీ’ ప్రపంచంలోకి దూసుకెళ్లి.. దాని గందరగోళం, భావోద్వేగాలు మరియు భారీ యుద్ధాలను అన్వేషిస్తుంది. ఇది సినిమా గుర్తింపులో ఒక అంతర్భాగంగా మారింది. ఇది కేవలం పాట కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీర యొక్క క్రూరమైన ప్రపంచం మరియు అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే ఒక గ్లింప్స్. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ‘ఓజీ’ ట్రైలర్ మరో భారీ సంచలనాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.