నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎట్టకేలకు జగన్ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు.. వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు జగన్. అక్కడ నుంచి NAD జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాల్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. భారీ జన సమీకరణ, స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి బర్నింగ్ ఇష్యూస్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ టూర్ కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం వ్యవహారాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడంలో భాగంగానే జగన్ పర్యటనపై రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. కొత్త రూట్ మ్యాప్ ప్రకారం ఎయిర్ పోర్టు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే మార్గం మారడంతో వైసీపీ ప్లాన్ బీ అమలులోకి తెచ్చింది. నగరం పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే పార్టీ అభిమానులు, జనం ఎక్కడిక్కడ స్వాగతం పలికేలా సన్నాహాలు చేసింది. కాకాని నగర్ దగ్గర స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసిత కుటుంబాలను కలిసి జగన్ మాట్లాడతారు. NAD పెందుర్తి జంక్షన్ల దగ్గర భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనకాపల్లి AML కాలేజ్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ రైతులు, తాళ్లపాలెం దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు, మత్స్యకారులు కలవనున్నారు వైసీపీ అధినేత. ఒకవైపు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చిన పోలీసులు.. నిర్బంధ వాతావరణం సృష్టిస్తున్నారని.. ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా అడ్డంకులు కల్పిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా జగన్ మెడికల్ కాలేజ్ టూర్ ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.
కాకినాడకు పవన్ కల్యాణ్.. నేడు ఉప్పాడలో బహిరంగ సభ..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. ఆ తరువాత నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. దివీస్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలతో ఉప్పాడ సముద్ర తీరం కలుషితమవుతోందని.. మత్స్య సంపద క్షిణించి జీవనోపాధి కోల్పోపోతున్నామని గత కొంత కాలంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సమావేశమై.. సముద్రంలో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు, మత్స్యకారుల సమస్యలు, ఉప్పాడ తీరం కోతకు గురికావడం వంటి అంశాలపై చర్చిస్తారు పవన్ కల్యాణ్. మత్స్యకారులతో సమావేశం ముగిసిన తరువాత స్థానిక జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఉప్పాడ చేరుకుంటారు జనసేనాని పవన్. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటలవరకూ ఉప్పాడ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉప్పాడలో బహిరంగసభలో మత్స్యకారుల భరోసా కల్పించేలా మాట్లాడనున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా.. ఎలాంటి ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ, ముగ్గురు డీసీపీలతో సహా 550 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. మరోవైపు, కలెక్టరేట్‌లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు..
నకలీ మద్యం తయారీ కేసులో సంచలన విషయాలు.. ఏ1 లొంగుబాటు..!?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దీనికి డైరెక్షన్ అంతా జనార్దన్ రావ్.. ఏ2 నిందితుడు కట్టా రాజు ఇందులో కీ రోల్ పోషించాడు. తయారీ దగ్గర నుంచి అమ్మకాలు, కలెక్షన్లు, వాటాల పంపిణీ అంతా అతనే చూసుకునేవాడు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డికి మద్యం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు.. అలియాస్ బాబు తీసుకునేవాడు. ఎక్సైజ్ అధికారుల రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. కట్టా రాజు నుంచి డైరీ, ల్యాప్ టాప్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కట్టా రాజుకు జనార్దనరావు 1990 నుంచి తెలుసు. జనార్దనరావు దుకాణాల్లో రాజు లెక్కలు చూసుకునేవాడు. ములకలచెరువులోని రాక్‌స్టార్ వైన్స్, చెండ్రాయునిపల్లెలో ఆంధ్రా వైన్స్‌లో పనిచేస్తూ వాటి బిజినెస్ వ్యవహారాలవీ చూసుకునేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జనార్దనరావు అతడిని పిలిచి మాట్లాడాడు. జయచంద్రారెడ్డి తనకు చాలా సన్నిహితుడని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన నెకిరికంటి రవి, కట్టా సురేంద్ర నాయుడు కలిసి పెద్దఎత్తున లిక్కర్ తయారు చేసి అమ్మాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
నేడు మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..
నేడు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. రెండు విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించనున్నారు. ఈనెల 23న మొదటి విడత MPTC, ZPTC పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు.
విజయ్ ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.. నటుడు శివరాజ్ సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా యాక్టర్ శివరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన స్నేహితుడు అయిన విజయ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. కానీ, కరూర్ తొక్కిసలాట వివాదం లాంటివి మరోసారి జరగకుండా వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించారు. అయితే, కరూర్ తొక్కిసలాట ఎలా జరిగిందో తనకు తెలియదు.. కాబట్టి, విజయ్ మరింత జాగ్రత్తగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇక, కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీలో ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. టీవీకే ఈ ఆరోపణలను ఖండించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని కోరింది. ర్యాలీకి 10,000 మంది హాజరుకు అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 30,000 మంది ప్రజలు వేదిక దగ్గరకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ప్రకటించారు.
20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..
దగ్గు మందుతో చిన్నారుల మరణాల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్‌లో ‘కోల్డ్‌రిఫ్’ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది. తాజాగా ప్రాణాంతకమైన “కోల్డ్రిఫ్” దగ్గు సిరప్ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసు తీవ్రతను కేసును దృష్టిలో ఉంచుకుని, శ్రీసాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమానులపై మధ్యప్రదేశ్ పోలీసులు గతంలో బహుమతిని ప్రకటించారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 20,000 నగదు అందిస్తామని ప్రకటన ఇచ్చారు. దీనితో పాటు.. పరారీలో ఉన్న కంపెనీ యజమానులను వెంటనే అరెస్టు చేయడానికి SIT బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ చర్యల ఫలితంగా రంగనాథన్ అరెస్టు జరిగింది.
ఆ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ..
తిలక్ వర్మ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొని టీమిండియాని మరోసారి విజేతగా నిలిపాడు మన తెలుగు కుర్రాడు. దీంతో ఒక్కసారిగా తిలక్ హీరోగా మారిపోయాడు. అయితే, ఇప్పుడు అతడు మరోసారి కొత్త బాధ్యతలను చేపట్టబోతున్నాడు. అవును, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీ పడే హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. కాగా, ఇటీవలే టీమిండియా A జట్టులో తన ఫామ్ ను కంటిన్యూ చేసాడు తిలక్ వర్మ. దీంతో ఇప్పటి వరకు ప్లేయర్ గా అదరగొట్టిన తిలక్ కెప్టెన్‌గా ఏ మేరకు రాణిస్తాడో అనేది వేచి చూడాలి. హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్ రెడ్డి, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్.
నేడు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య కీలక పోరు.. ముచ్చటగా మూడోసారి గెలిచేనా..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో భారత్ జోరు మీదుంది. ఇక, మూడో విజయంపై కన్నేసింది. ఈరోజు ( అక్టోబర్ 9న) విశాఖపట్నంలోని వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో హర్మన్‌ప్రీత్‌సేన.. సౌతాఫ్రికాను ఢీ కొనబోతుంది. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడాక, గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన సఫారీ జట్టు.. ఆల్‌రౌండ్ బలంతో కనిపిస్తుంది. కానీ, ఓటమే ఎరుగని విశాఖలో మ్యాచ్ జరుగుతుండడం, జట్టు మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు హ్యాట్రిక్ గెలుపు మరీ కష్టమేమీ కాకపోవచ్చు. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తడబాటు భారత్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్రంగా నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లు సమయోచితంగా రాణిస్తుండటంతో ఆ మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. కానీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి.. ఎందుకంటే, ఆ తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో కాబట్టి బ్యాటింగ్ విభాగం మొత్తం సమష్టిగా సత్తా చాటితే మంచిది. ప్రతీక రావల్ భారీ స్కోర్లు చేయకపోయినా.. జట్టుకు కావాల్సిన స్కోర్ మాత్రం అందిస్తుంది. హర్లీన్ డియోల్ సైతం నిలకడగా రాణిస్తోంది.
రాజమౌళి- మహేష్ బాబు సినిమా టైటిల్ ఫిక్స్..?
దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతుంది. అయితే, ఇప్పటి వరకు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వారితోనే రాజమౌళి పని చేశారు. కానీ, ఇప్పుడు ‘SSMB29’ పై మొదటి నుంచి భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అలాగే, మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ విధంగా చూసిన కూడా ఈ ప్రాజెక్టు చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ స్పెషల్ మూవీకి టైటిల్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా, క్యాచీగా ఉండేలా రాజమౌళి చూసుకుంటారని టాక్. ఇక, ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. కాగా, ఈ సస్పెన్స్ కి తెర పడాలంటే మనం నవంబర్ 16 వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ సమయానికే రానున్నాయి. ఇక, ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో.. వారణాసి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు టాక్. ఇప్పటికే, మహేష్, ప్రియాంక షూట్ పూర్తయింది.. వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ రెస్టారెంట్’
ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ తెలుగు ప్రేక్షకులలో పెద్ద క్రేజ్ సంపాదించాయి. వీకెండ్ అంటే కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్‌లో వచ్చాయో చూడడం అనేది ఒక ఫన్ రూటైన్‌లా మారింది. తాజాగా ఈ వారం తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్న మరో ప్రత్యేక సినిమా డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన ‘బకాసుర్ రెస్టారెంట్’. చిన్న హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ అనుభవాన్ని అందిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పటివరకు 250 మిలియన్ స్ట్రీమింగ్ మిటిట్స్‌ను దాటింది. ‘బకాసుర్ రెస్టారెంట్’ హారర్-కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందించబడింది. కథలో క్షుద్ర పూజల కారణంగా నిద్రలేని ఆత్మలు, వాటి ప్రభావం వల్ల ఎదురయ్యే ఇబ్బంది కర సంఘటనలు ప్రధానంగా ఉంటాయి. ఈ కథ ప్రత్యేకత.. మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న కమెడియన్ ప్రవీణ్ తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. సినిమా హారర్ అంశాలతో పాటు సరదా ఎలిమెంట్స్ అందించడం వల్ల, ప్రేక్షకులు మ్యూజిక్, సీన్స్, ఎఫెక్ట్స్‌లను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.