కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. రెండో రోజు బిజీబిజీగా గడపనున్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి టీడీపీ కార్యాలయానికి చేరుకుని జన నాయకుడు సెంటర్ ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అక్కడ ప్రజలనుంచి వినతులు స్వీకరించనున్నారు.. అనంతరం కుప్పం పార్టీ కేడర్‌తో సమావేశం అవుతారు.. మధ్యాహ్నం 12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని దివంగత శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం 1.20 గంటలకు కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 92 కోట్లతో చేపట్టనున్న కడలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు సీఎం.. ఆ తర్వాత సాయంత్రం 5.05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంతింటి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు టీడీపీ అధినేత.. ఇక, సాయంత్రం 6.10 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ చేరుకుని అకడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్ రెడీనెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత సాయంత్రం యూనివర్సిటీలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం.
పల్నాడు జిల్లాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం..
పల్నాడు జిల్లాలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు… నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఈ ఘటన జరిగింది.. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ లోడింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు గేటు వద్ద కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ఘటనతో రైళ్లను దారి మళ్లించారు.. గుంటూరు- హైదరాబాద్ మధ్య నడవాల్సిన రైళ్లను విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వెల్లడించారు రైల్వే అధికారులు..
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. నేడు ఉదయం 10:30 గంటల సమయంలో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే మాజీమంత్రి కేటీఆర్.. ఏసీబీ విచారణకు లీగల్ టీంతో వెళ్లారు. తన వెంట లీగల్ టీంని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. విచారణ అంశాన్ని ఏసీబీ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇవాళ్టి తీర్పు మీదే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు.. ఫార్ములా ఈ రేసు కేసును ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు దర్యాప్తుచేస్తున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేటీఆర్ తెలిపారు.. కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడీ.. ఇంకా తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు.
నేడే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. మధ్యాహ్నం ఈసీ ప్రెస్‌మీట్
ఈ కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి స్టార్ట్ కానుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ( జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా సమావేశం నిర్వహించనుంది.
ఆంగ్ల భాషలో భారత్ భేష్.. తొలి స్థానంలో ఢిల్లీ
ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ రిపోర్ట్ వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ నిలిచింది. గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్‌సన్ అనే సంస్థ ఈ సర్వే చేసింది. సోమవారం నాడు విడుదలైన ఈ నివేదికలో భారత్, ఫిలిప్పీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ దేశాల ప్రజల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పోకడపై రిసెర్చ్ చేశారు. ఆ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 7.50 లక్షల పరీక్షల ఫలితాలను సమీక్ష చేశారు. కాగా, వెర్‌సాంట్ బై పియర్‌సన్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జామ్స్ లో ఆంగ్ల భాషపై క్యాండిడెట్స్ కు ఉన్న పట్టును వారు పరీక్షించారు. దీని వల్ల వ్యాపార సంస్థలు నిపుణులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో ఇది సహకరిస్తుంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. ఇంగ్లిష్ భాషపై పట్టులో భారత్ స్కోరు (52) ప్రపంచ సగటు (57) రేటు కంటే కిందికి ఉంది. సంభాషణా నైపుణ్యంలో మాత్రం ప్రపంచ సగటు (54) కంటే ఎక్కువ (57) స్కోర్ చేసింది ఇండియా. ఇంగ్లిష్ రాయడంలో ప్రపంచ సగటు, భారత్ స్కోరు ఇక్వెల్ (61)గా ఉన్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం.. బీహార్ నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీ వరకు భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్‌లో దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. దహను తాలూకాలో తెల్లవారుజామున 4.35 గంటలకు భూకంపం సంభవించిందని జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ వివేకానంద కదమ్ తెలిపారు. తాలూకాలోని బోర్డి, డాప్‌చారి, తలసరి ప్రాంతాల ప్రజలు తెల్లవారుజామున భూ ప్రకంపనలను అనుభవించారని వెల్లడించారు. ఉదయం 6.40 గంటల ప్రాంతంలో మోతీహరి, సమస్తిపూర్ సహా బీహార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ వేదికగా నమోదైంది.
అమెరికాలో కలకలం రేపుతున్న తొలి బర్డ్ ఫ్లూ మరణం..
అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం తీవ్ర కలకలం రేపుతుంది. లూసియానాలో ఓ వ్యక్తికి బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో పాటు పలు సమస్యలతో 65 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. అడవి పక్షులు, పెరటి మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆ వ్యక్తికి హెచ్5ఎన్1 సోకిందని చెప్పుకొచ్చారు. అయితే, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని పేర్కొన్నారు. అయితే, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికాలో దాదాపు 70 మంది వ్యక్తులకు బర్డ్ ఫ్లూ సోకింది. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు, కోళ్ల ఫారాలు, పాడి పశువుల నుంచి ఈ వైరస్ వ్యాపించింది. అలాగే, 2022లో పౌల్ట్రీలో ప్రారంభమైన బర్డ్ ఫ్లూ వ్యాప్తి దాదాపు 130 మిలియన్ల అడవి, దేశీయ పౌల్ట్రీలకు వ్యాపించింది. దీని వల్ల 917 పాడి పశువులు అనారోగ్యానికి గురి అయ్యాయి. ఇక, లూసియానాలో మరణించిన రోగి నుంచి తీసుకున్న వైరస్ శాంపిల్స్ లో D1.1 జన్యు సంబందిత కారకంకు చెందినదిగా తేలింది. అదే రకం వైరల్ ఇటీవల వాషింగ్టన్ స్టేట్‌లోని అడవి పక్షులు, పౌల్ట్రీలో కనుగొనబడింది.
ఇంగ్లండ్‌తో సిరీస్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ 1-3తో ఓడిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీలో టీమిండియా తరఫున స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల్లో 32 వికెట్స్ పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అయితే వెన్ను గాయం కారణంగా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 150కి పైగా ఓవర్లు వేశాడు. ఎక్కువ పనిభారమే అతడి వెన్ను నొప్పికి కారణమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లోని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. బుమ్రాకు తగిన విశ్రాంతిని ఇచ్చి.. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి తాజాగా ఉంచాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అతడిని సిద్ధం చేయడానికి బీసీసీఐ వైద్య బృందం కసరత్తులు చేస్తోంది. ఎందుకంటే ఛాంపియన్స్ టోర్నీలో టీమిండియాకు బుమ్రా ఎంతో కీలకం. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతను బీసీసీఐ వైద్య బృందం ఇంకా అంచనా వేయలేదని తెలుస్తోంది. గాయం గ్రేడ్ 1 విభాగంలో ఉంటే కోలుకోవడానికి కనీసం 2, 3 వారాలు పడుతుంది. గ్రేడ్ 2 అయితే 6 వారాలు పట్టొచ్చు. ఇక గ్రేడ్ 3 అయితే మాత్రం విశ్రాంతి, పునరావాస కార్యక్రమానికి దాదాపుగా మూడు నెలల సమయం పడుతుంది. బుమ్రాకు అయిన గాయం తీవ్రత ఆధారంగా అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడా అన్నది తేలనుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 22న టీ20 సిరీస్ మొదలవుతుంది.
దబిడి దిబిడి నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన నాగవంశీ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణలేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోగా ట్రైలర్ కు అటు ఫ్యాన్స్ నుండి ఇటు సినీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రంలో అన్ని సాంగ్స్‌కు విశేషంగా ఆకట్టుకోగా ఒక సాంగ్ మాత్రం కాంట్రవర్సీకి కేంద్ర బిందువైంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామతో కలిసి బాలయ్య చేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ రిలీజ్ అయ్యాక నెగిటివ్ ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ సాంగ్‌లో ఊర్వశి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పులు విమర్శలకు దారితీసింది. ఆ విమర్శలపై తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించారు. ఓ మీడియా ఛానెల్ తో డాకు మహారాజ్ విశేషాలను పంచుకుంటూ ‘ఆ సాంగ్ షూట్ టైమ్ లో చూసాను, లిరికల్ సాంగ్ చేసినప్పుడు చూసా, సీజీ అప్పుడు సాంగ్ చూసా నాకు ఎప్పుడు సాంగ్ అంత హార్డ్ గా అనిపించలేదు. బాలయ్య ఎమ్మెల్యే అనే ఇమేజ్ మూలంగా అలా నెగిటివ్ గా చూసారా అని అర్ధం కాలేదు. బాలకృష్ణ సినిమాలో ఊరమాస్ ఎలిమెంట్ ఉండాలి అనుకున్నాం. సినిమా అంతా స్టైలిష్ గా చేసి ఊరమాస్ ఎలిమెంట్ ను సాంగ్ లో సెట్ చేసాం. కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసినా ఎంజాయ్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు’ అని అన్నారు.
నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్ దిల్ రాజు మైత్రి మూవీస్ నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీ తేజ నీ పరామర్శించారు.. కాగా నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు కిమ్స్ కి వెళ్లనున్నారు. మొన్నామధ్య శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు వెళ్లాలనుకున్న అల్లు అర్జున్ ను రావద్దోదని సూచించిన పోలీసులు నేడు అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతిచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని తెలిపారు పోలీసులు సూచిస్తూ కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. నేడు పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఇవాళ రానున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. ఇవాళ అల్లు అర్జున్ కిమ్స్ కి రానుండటంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించనున్నారు.