సమాచారం లేకుండా విమానం రద్దు.. సిబ్బందితో సినీ నటుడి వాగ్వాదం..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు కావడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గురువారం రోజు రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు.. సమాచారం లేకుండా స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానం.. తిరిగి రాత్రి 8.45 గంటలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతుంది.. కానీ, ఫ్లైట్ రద్దుపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేశారు.. సాయంత్రం నుండి వేచి ఉండటంతో అసహనంతో బైటాయించారు ప్రయాణికులు.. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఈ నిరసనలో ఎఫ్2 సినిమా నటుడు, సీనియర్ నటుడైన ప్రదీప్ కూడా పాల్గొన్నారు.. ఓ దశలో స్పైస్ జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.. ఇక, శ్రీ ప్రయాణికుల నిరసన తరువాత స్పందించి.. ఆ తర్వాత ఏర్పాట్లు చేశారు అధికారులు…
క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి.. టీటీడీ కీలక నిర్ణయం..
1950కి పూర్వం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. 1943కి పూర్వం తిరుమలకు చేరుకోవడానికి కేవలం నడక దారి మాత్రమే ఉండేది. 1943లో మొదటి ఘాట్ రోడ్‌ను, 1979లో రెండో ఘాట్ రోడ్‌ను నిర్మించింది టీటీడీ. ఘాట్‌రోడ్‌ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 1951లో రోజుకు సగటున 619 మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ ఏడాది మొత్తం 2 లక్షల 26 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కలిగింది. 1961లో రోజుకు సగటున 3,197 మంది, 1971లో రోజుకు 9,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 1981లో రోజువారీ దర్శనాల సంఖ్య ఏకంగా 21 వేల 786కి పెరిగింది. 1991లో రోజుకు 32 వేల 332 చొప్పున ఏడాది పొడవునా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి 18 లక్షలు దాటేసింది. 2001లో రోజుకు 65 వేల మంది, 2011లో 70 వేల చొప్పున స్వామిని దర్శించుకున్నారు. 2021లో కోవిడ్ ఇయర్ కావడంతో భక్తుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత కాలంలో మళ్లీ పెరిగింది. గత 11 ఏళ్లలో తిరుమల శ్రీవారిని 25 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. 2015 నుంచి చూస్తే 2019లో రికార్డుస్థాయిలో రెండు కోట్ల 76 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు కోటి 76 లక్షల మందికి దర్శనభాగ్యం లభించింది. మిగిలిన నాలుగు నెలల్లో మరో 80 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తుండడంతో మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలపై సర్కార్ ఫోకస్..
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అమ్మలగన్నయమ్మ.. ఆమహాశక్తి.. విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు అధికారులు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహోత్సవాల కోసం చేపడుతున్న ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా వేసిన ప్రణాళికలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిదేశం చేశారు.
నేడు వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు భక్తులు రెడీ అయ్యారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతంలో 14 చెరువులు, వరంగల్‌లో 7 తటాకాలలో నిమజ్జనం జరగనుంది. శోభయాత్ర జరిగే రహదారుల పొడవునా విద్యుత్ లైట్లు అమర్చారు. బారికేడ్లతో పాటు 28 క్రేన్లు, తెప్పలు సిద్ధంగా ఉంచారు. అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీ లు, 53 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు 2100 పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? ఐపీఎస్‌పై డిప్యూటీ సీఎం చిందులు
చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే చట్టాలు తప్పితే ఇంకెవరు? రక్షణగా ఉంటారు. చెట్లు నరికివేత. అక్రమ ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని న్యాయస్థానాలు మొత్తుకుంటున్నాయి. ప్రభుత్వాలను తీవ్రంగా మందలిస్తున్నాయి. గురువారం కూడా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వ పెద్దల్లో ఏ మాత్రం చలనం ఉండడం లేదు. తాజాగా అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఒక ఐపీఎస్‌పై ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చిందులు లేశారు. మా వాళ్లను తక్షణమే వదిలిపెట్టకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని కుర్దు గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఫిర్యాదు వచ్చింది. దీంతో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ గ్రామానికి వెళ్లి మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంతలోనే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్‌సీపీ కార్యకర్తలు ఫోన్ ఇవ్వగా.. తన నెంబర్‌కు ఫోన్ చేయాలంటూ ఐపీఎస్ సూచించారు. దీంతో అంజనా కృష్ణ మొబైల్‌కు అజిత్ పవార్ ఫోన్ చేసి.. నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? తక్షణమే వెళ్లిపోవాలని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం.. ఆదేశాలు జారీ
అంగరంగ వైభవంగా కొనసాగిన గణేష్ ఉత్సవాలు నిమజ్జనం దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు భక్తులు విఘ్నేషుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జన సమయంలో వినాయకుడి ఫొటోలు, వీడియోలు తీయడం.. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇలాంటి వారికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. గణేష్ విగ్రహ నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఇది తెలంగాణలో కాదు మహారాష్ట్రలో. పూణే పోలీసులు గురువారం ఒక ఉత్తర్వులను జారీ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 15 మధ్య నిమజ్జనం చేయనున్న గణేష్ విగ్రహాల చిత్రాలు, వీడియోలను చిత్రీకరించడం, ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూన్నట్లు తెలిపారు. ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (BNSS) సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని ఒక పోలీసు అధికారి వార్తా సంస్థకు తెలిపారు. పూణేలో విగ్రహాల నిమజ్జనం శనివారం జరుగుతుంది. “సహజ జల వనరులలో లేదా కృత్రిమ ట్యాంకులలో నిమజ్జనం చేస్తున్న గణపతి విగ్రహాల దృశ్యాలను చిత్రీకరించడం, వ్యాప్తి చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుంది. ప్రజా శాంతికి భంగం కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారత శిక్షాస్మృతి (BNS)లోని సంబంధిత విభాగాల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
మనసు మార్చుకున్న ట్రంప్.. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం, జపాన్ వాహనాలపై సుంకాలు ప్రస్తుత 27.5% నుంచి 15%కి తగ్గించబడతాయి. ఇది ఈ నెలాఖరు నాటికి అమల్లోకి రావచ్చు. డొనాల్డ్ ట్రంప్ గురువారం కొత్త అమెరికా-జపాన్ వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిని ‘అమెరికా-జపాన్ వాణిజ్య సంబంధాల కొత్త శకం’ ప్రారంభం అని ఆయన అభివర్ణించారు. ఈ ఆర్డర్ అమెరికాలోకి జపాన్ దిగుమతులన్నింటిపై 15 శాతం బేస్‌లైన్ సుంకాన్ని విధిస్తుంది. అదే సమయంలో ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, ఏరోస్పేస్ ఉత్పత్తులు, జనరిక్ మందులు, దేశీయంగా అందుబాటులో లేని సహజ వనరులకు రంగాలవారీగా మినహాయింపులను అందిస్తుంది.
టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. కనిపించని ఎలాన్ మస్క్
ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ఇక అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ ట్రంప్ పక్కనే కనిపిస్తూ ఉండేవారు. ఓవల్ కార్యాలయంలో మస్క్.. తన కొడుకును భుజాలపై ఎక్కించుకుని ట్రంప్ పక్కనే ఉండేవారు. అంతగా కలిసి మెలిసి తిరిగిన ట్రంప్-మస్క్ మధ్య ఏం చెడిందో.. ఏమైందో తెలియదు గానీ ట్రంప్ లక్ష్యంగా మస్క్ విమర్శలు గుప్పించారు. అనంతరం నెమ్మది.. నెమ్మదిగా స్నేహం చెడింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. ఆ బంధం పూర్తిగా తెగిపోయినట్లుగా అర్థమవుతోంది. గురువారం ట్రంప్ వైట్‌హౌస్‌లో టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు అమెరికాలో ఉన్న దిగ్గజ టెక్ సీఈవోలంతా హాజరయ్యారు. కానీ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ మాత్రం కనిపించలేదు. మొన్నటిదాకా వైట్‌హౌస్‌లోనే ఉన్న మస్క్ ఇప్పుడు గైర్హాజరయ్యారు. దీంతో ట్రంప్-మస్క్ మధ్య స్నేహం పూర్తిగా చెడినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ పక్కన బిల్ గేట్స్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, పిచాయ్ సహా టెక్ నాయకులంతా కనిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్ సంస్థల నుంచి డజను మంది హాజరైనట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు.
రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. కాకపోతే, ఈసారి ఆ దేశం తరుపున!
న్యూజిలాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. కానీ, ఈ సారి ఆయన బ్లాక్ క్యాప్స్ కోసం కాదు.. తన సొంత దేశమైన సమోవా జట్టు కోసం ఆడనున్నారు. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ 41 ఏళ్ల దిగ్గజం, సమోవాకు వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ అర్హత సాధించడంలో సహాయం చేయబోతున్నాడు. టేలర్ న్యూజిలాండ్ తరఫున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టి20లు ఆడి రికార్డు సృష్టించాడు. ఇది ఇలా ఉండగా.. తాను న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న కూడా ఎప్పుడూ సమోవా క్రికెట్‌కు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే కోరిక ఉందని సీతెలిపారు. మొదట కోచ్‌గా లేదా పిల్లలకు మార్గదర్శనం చేయడం అనుకున్నా కానీ, తిరిగి ఆటగాడిగా జట్టులో భాగమవుతానని ఊహించలేదని ఆయన స్పష్టం చేశాడు. సమోవా జట్టుకు కోచ్‌గా ఉన్న టారుణ్ నేతులా (2012లో బ్లాక్ క్యాప్స్ తరఫున ఆడిన మాజీ ఆటగాడు) టేలర్‌ను జట్టులో చేర్చడం పట్ల ఎంతో కృషి చేశారు. అలాగే ఆక్‌లాండ్ ఏసెస్ ఆల్‌రౌండర్ షాన్ సోలియా కూడా జట్టులో ఉన్నాడు. ప్రపంచ కప్‌కి తొలిసారి అర్హత సాధించాలనే సమోవా కలను నిజం చేయడంలో టేలర్ అనుభవం కీలకం కానుంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఒక స్టైలిష్ పోస్టర్‌తో గిఫ్ట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్ కావడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ శనివారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతున్న ట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌పై ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ను చిత్రీకరించడం ద్వారా ఈ షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈ సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌లు కంపోజ్ చేయగా, ఫుల్ ఎనర్జీతో నిండిన కొరియోగ్రఫీని దినేష్ మాస్టర్ అందించనున్నారు. ఫ్యాన్స్‌కి పక్కా ఫీస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా మొత్తాన్ని ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నింపాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్ – హిట్ కొట్టిందా?
క్రిష్ – అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఘాటీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ వైరల్ అవుతోంది. అయితే ప్రేక్షకుల రియాక్షన్ ప్రకారం – సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన బలం గా నిలిచాయి. ప్రత్యేకించి అనుష్క శెట్టి నటన గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అనుష్క తన అభినయం, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందని కామెంట్లు వస్తున్నాయి. అయితే, కొన్ని సన్నివేశాలపై మాత్రమే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సనివేశాలు సాగదీసినట్లుగా బోరింగ్‌గా అనిపించాయని, కథనం కొంతవరకు ఊహించదగ్గ ఉందని కొందరు చెబుతున్నారు. కానీ మొత్తం మీద సినిమాపై ఎక్కువమంది పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సినీ వర్గాల అంచనాల ప్రకారం, ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. కథలోని చిన్న లోపాలను పక్కనపెడితే, అనుష్క నటన, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ సినిమాను విజయవంతం చేసే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ‘ఘాటీ’ అనుష్క కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.