గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతులు.. ఉత్తర్వులు జారీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది.. కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. వారికి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వనుంది.. 50 చదరపు గాజాల లోపు ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఫీజ్ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నగర పాలక సంస్థలు.. నగర పంచాయతీల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి ఫీజు వసూలు చేయనున్నారు.. గతంలో 3 వేల రూపాయలుగా ఉన్న ఇంటి నిర్మాణ ఫీజ్.. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఒక్క రూపాయికి తగ్గిపోయింది.. ఇక, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం ఇంటి నిర్మాణం డాక్యుమెంట్ ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసి రూపాయి ఫీజ్ చెల్లించేలా ఏర్పా్ట్లు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య ప్రజలపై 6 కోట్ల రూపాయలకు పైగా భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.. కాగా, పేద, మధ్య తరగతి వర్గాలకు ఒక్క రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతుల ఇవ్వాలనే కీలక నిర్ణయానికి ఇప్పటికే తీసుకుంది కూటమి సర్కార్.. తాజాగా, దీనిని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. ఆ వర్గాలకు శుభవార్త చెప్పింది..
ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శమనిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు.. ఇక, శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తారు.. దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. మరోవైపు, అమ్మవారి దర్శనాకి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుండగా.. వారికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు..
తెలంగాణను వదలని వరణుడు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదృతంగా సాగుతోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పథకం ప్రకారం జరిగిన కుట్ర.. నేడు హైకోర్టులో టీవీకే పిటిషన్‌పై విచారణ!
నేడు మద్రాసు హైకోర్టులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పిటిషన్‌పై విచారణ జరగనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సోమవారం టీవీకే పిటిషన్ వేసింది. పథకం ప్రకారం జరిగిన కుట్ర అనే అనుమానాన్ని టీవీకే న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించాలని టీవీకే న్యాయవాదులు విన్నవించారు. ఆ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ జరపనుంది. వేలుస్వామిపురం వద్దకు తమిళ వెంట్రికళగం అధినేత విజయ వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్‌లు రావడం, ఓ చోట లాఠీచార్జ్ జరిగినట్టు వీడియోలు ఉండడం సహా దళపతి వాహనంపైకి రాళ్లు రువ్వినట్టుగా వచ్చిన సంకేతాలను టీవీకే న్యాయవాద విభాగం తీవ్రంగా పరిగణించింది. కరూర్ ఘటన ఓ పథకం ప్రకారం జరిగిన కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తూ.. టీవీకే న్యాయవాదుల బృందం చెన్నై అడయార్ నివాసంలో న్యాయమూర్తి దండపాణిని కలిశారు. కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. కరూర్ ఘటన కేసును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించి విచారించాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని న్యాయమూర్తి తెలపడంతో టీవీకే మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది.
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో..!
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప స్వామి వారి దివ్య ప్రసాదం కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన అసవరం లేదు. ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయంను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కలిపిస్తోంది. ఈ సదుపాయం మరో నెలలో అమలులోకి రానుంది. టీడీబీ ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు ట్రావెన్‌కోర్ పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు తమ ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. టీడీబీ తన కార్యకలాపాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. కొట్టారక్కర శ్రీ మహాగణపతి ఆలయంలో కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్.. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ… ‘శబరిమల లాంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ నెల లోపు అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. ముందుగా శబరిమలతో పాటు ప్రధాన దేవాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఆపై ఆరు నెలల్లో 1252 దేవాలయాలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
డాల్బీ ఆడియో సౌండ్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్, QLED డిస్‌ప్లేతో Acerpure Aspire Neo కొత్త టీవీలు లాంచ్!
భారత మార్కెట్‌లోకి ఏసర్‌ప్యూర్ ఇండియా తన కొత్త నియో సిరీస్ స్మార్ట్ టీవీలును విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Aspire Neo, Swift Neo UHD LED, Elevate Neo QLED మోడళ్లు ఉన్నాయి. 32 ఇంచుల నుంచి 65 ఇంచుల వరకు విభిన్న స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. తాజా Google TV 5.0తో పాటు Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న ఈ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉంది. Aspire Neo మోడళ్లు 32 అంగుళాలు, 43 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు Dolby Audio (30W) సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. అలాగే 1GB RAM, 8GB స్టోరేజ్‌తో వస్తున్నాయి. అలాగే Swift Neo UHD LED మోడళ్లు 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లలో లభ్యమవుతాయి. వీటిలో డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో కూడిన అనుభవం లభిస్తుంది. 2GB RAM + 16GB స్టోరేజ్‌తో పాటు AI Picture Quality (AIPQ), ALLM, VRR, MEMC, Filmmaker Mode, అలాగే కరావోకే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక Elevate Neo QLED మోడళ్లు కూడా 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లలో వస్తాయి. వీటిలో QLED డిస్‌ప్లే, Dolby Vision, Dolby Atmos సౌండ్ సిస్టమ్ లభ్యమవుతాయి. అలాగే MEMC, ALLM, VRR వంటి గేమింగ్ ఫీచర్లతో పాటు గేమ్‌ప్యాడ్ సపోర్ట్ సౌకర్యం కూడా ఉంది. వీటితోపాటు, 40W పవర్‌ఫుల్ స్పీకర్లతో మరింత శక్తివంతమైన ఆడియో అనుభవాన్ని ఇస్తాయి.
రేపటి నుంచే పోస్టల్ కొత్త రూల్స్ అమల్లోకి.. ఇకపై ఓటిపి ఆధారిత డెలివరీలు..
అక్టోబర్ 1 నుంచి పోస్టాఫీసు స్పీడ్ పోస్ట్ సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు డెలివరీ సమయంలో సంతకం తీసుకునే విధానానికి బదులుగా, ఇకపై వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) తప్పనిసరి కానుంది. పార్శిల్‌ను అందుకునేవారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని డెలివరీ సిబ్బందికి చెబితేనే పార్శిల్‌ను అందజేస్తారు. ఈ కొత్త విధానం ద్వారా పార్శిళ్లు సరైన వ్యక్తులకు చేరుతున్నాయో లేదో నిర్ధారించుకోవచ్చు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ లోని 6,000కు పైగా పోస్టాఫీసుల్లో ఈ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. భద్రత, విశ్వసనీయత, కస్టమర్ సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 13 ఏళ్ల విరామం తర్వాత, అంటే 2012లో సవరించిన ధరలను మళ్లీ ఇప్పుడు మార్చారు. ఈ కొత్త టారిఫ్‌లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక కొత్తదారాలను పరిశీలిస్తే.. 50 గ్రాముల వరకు రూ.19, 50-250 గ్రాముల మధ్య రూ.24, 250-500 గ్రాముల మధ్య రూ.28, అలాగే సుదూర ప్రాంతాలకు (200 నుండి 2,000 కి.మీ)లకు 50 గ్రాముల రూ.47 వరకు వాసులు చేయనున్నారు. ఇక ఈ స్పీడ్ పోస్ట్ సేవలకు జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, విద్యార్థుల సౌలభ్యం కోసం మంత్రిత్వ శాఖ స్పీడ్ పోస్ట్ టారిఫ్‌పై 10% తగ్గింపును ప్రకటించింది. అలాగే, కొత్తగా ఎక్కువ మొత్తంలో సేవలు వినియోగించుకునే కస్టమర్లకు 5% ప్రత్యేక తగ్గింపు ఉంటుందని పోస్టల్ అధికారులు తెలిపారు.
నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్.. శ్రీలంకతో భారత్ ఢీ!
ఆసియా కప్ 2025 ముగిసిందని క్రికెట్ అభిమానులు చింతించాల్సిన అవసరం లేదు. నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం అవుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మెగా క్రికెట్ టోర్నీ జరుగుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవని భారత జట్టు.. ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది చూడాలి. శ్రీలంక మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్మృతి మంధాన, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలతో బౌలింగ్ బాగానే ఉంది. సమిష్టిగా రాణిస్తే భారత జట్టుకు వన్డే ప్రపంచకప్‌లో ఎదురుండదు. మంచి భాగస్వామ్యాలు నమోదైతే భారీ స్కోర్ చేయొచ్చు. మరోవైపు శ్రీలంక కూడా అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. బ్యాటర్లు విష్మి, హర్షిత.. కెప్టెన్ చమరి ఆటపట్టు, ఆల్‌రౌండర్ కవిష్క, బౌలర్లు సుగంధిక, ఇనోకాలపై అంచనాలు ఉన్నాయి. బర్సపారా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీల లెంత్ తక్కువగా ఉండడం బ్యాటర్లకు కలిసొచ్చే అంశం. అయితే ఇక్కడ బంతి బౌన్స్ కూడా అవుతుంది. పేసర్లకు ఇది కలిసిరానుంది. ఈరోజు బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి సమరం జరిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ గువాహటిలో ఆరంభం కానుంది.
రాజాసాబ్.. ట్రైలర్.. రెబల్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరా.?
సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్‌తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది. ఆరు నెలల ముందే టీజర్ రిలీజ్ చేసి సినిమాలపై అంచనాలు పెంచేసిన మారుతి మూడు నెలల ముందే ట్రైలర్‌ను వదిలేశాడు. బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్‌ను డైరెక్ట్ చేయగలడా. ఈ డౌట్ ఫ్యాన్స్‌కే కాదు మారుతి ఇంట్లో కూడా వచ్చింది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్‌స్టెప్ వేశాడని అందరూ అంటుంటే ఒకానొక దశలో ప్రాజెక్ట్ వదిలేద్దామనుకున్నానని ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా తీశానన్నాడు మారుతి. తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ ట్రైలర్ బుజ్జిగాడులో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ ను సెట్ చేసి డార్లింగ్‌ను ఫ్యాన్స్ మెచ్చే విధంగా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. వింటేజ్ రెబల్ స్టార్ ను మరోసారి ఫ్యాన్స్ కు చూపించాడు మారుతీ. కానీ ఈ మూడు నిమిషాల ట్రైలర్ కు తమన్ ఇచ్చిన నేపధ్యసంగీతం చప్పగా ఉండనే కామెంట్స్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తోంది. తమన్ రెగ్యులర్ గా ఇచ్చే సౌండింగ్ లా ఉంది తప్ప కిక్ ఇచ్చే బీజీఎమ్ ఇవ్వలేదని, మిక్సింగ్ కూడా అంతంత మాత్రంగా ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ సినిమాల ఫ్లేవర్ ట్రైలర్ లో కనిపించింది.
అట్లీ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?
ముంబాయిలో షూటింగ్ సైలెంగ్‌గా సాగిపోతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22xA6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. జవాన్‌లో షారూక్‌ను రకరకాల గెటప్స్‌లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్‌లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్‌లో మొదలైంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్ ముంబాయిలో శరవేగంగా సాగుతోంది. బన్నీ అయితే మూడు నెలలుగా ముంబాయ్‌లోనే ఎక్కువగా వుంటున్నాడు. ఇందులో బన్నీ నాలుగు డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తున్నాడన్న టాక్ బైటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వార్తలో నిజమెంత అన్న విషయమై ఆరాతీయగా ఈ సినిమాలో హీరోది డ్యూయెల్ రోల్ మాత్రమేనని తెలిసింది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని ముందుగా ఒక గెటప్‌కు సంబంధించిన సీన్స్ తీస్తున్నారని సమాచారం. పుష్ప కోసం ఐదేళ్లపాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్తప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషిన్స్‌తో వర్క్ చేస్తున్నాడు అట్లీ. భారీ విఎఫ్‌ఎక్స్ వర్క్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. AA 26లో హీరోయిన్‌గా ఆల్రెడీ దీపిక పదుకునేను సెలెక్ట్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్స్‌గా రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ నటిస్తుంన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ముంబయి షెడ్యూల్ పూర్తికాగానే మరో హీరోయిన్ని ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారట.
కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. అయితే ఇదే సినిమాపై కన్నడలో కొంత వివాదం నడిచింది. ఓజీ సినిమాకు బెంగుళూరులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా.. కన్నడ సంఘాలు వచ్చి గొడవ చేశాయి. దీంతో ఓజీ ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు. అయితే కాంతార-1కు టికెట్ రేట్లను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఓజీకి కన్నడలో ఎదురైన వివాదాన్ని ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తు చేశాయి. దీంతో ఆ గొడవపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. బెంగుళూరులో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కాంతార1కు ప్రోత్సాహాన్ని ఆపొద్దు. అక్కడ జరిగిన దాంతో.. ఇక్కడ నిర్ణయాలను పోల్చొద్దు. మన సినిమాలకు కర్ణాటకలో ప్రోత్సాహకాలు అందట్లేదనే విషయంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై రెండు ఇండస్ట్రీల ఫిల్మ్ ఛాంబర్లు కూర్చుని మాట్లాడుకోవాలి. సినీ పరిశ్రమ బాగా ఎదుగుతోంది. ఇలాంటి టైమ్ లో సంకుచిత భావం ఉండొద్దు. జాతీయ భావంతోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పరిణామాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తా’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.