కొనసాగుతోన్న పీఎస్‌ఎల్వీ-ఎఫ్ 16 కౌంట్‌డౌన్.. నేడు నింగిలోకి నిసార్..
నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని అధ్యయనం చేయనుంది నిసార్.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుండగా.. జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ శాటిలైట్ ను జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక ద్వారా నింగులోకి పంపనున్న నేపథ్యంలో.. రెండు రోజులుగా షార్‌లోనే ఇస్రో, నాసా అమెరికన్ శాస్తవ్రేత్తలు మకాం వేశారు..
సింగపూర్ టూర్‌లో చంద్రబాబు బిజీబిజీ.. నాల్గో రోజు షెడ్యూల్ ఇదిగో..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతోంది.. రాష్ట్రానికి పెట్టుబడులు, రాజధాని అమరావతి అభివృద్ధియే అజెండాగా సాగుతోన్న ఈ పర్యటనలో కీలక సమావేశాలు, చర్చలు, ఒప్పందాలు కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా బిజీగా గడపుతున్న చంద్రబాబు.. ఇవాళ నాల్గో రోజు కీలక సమవేశాలు నిర్వహించబోతున్నారు.. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.. క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) సీఈవో సంజీవ్ దాస్‌గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్ పార్క్‌లలో పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.. మండాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ సీఈవో మైక్ బార్క్‌లేతో భేటీ.. ఎకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్‌లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్‌పై చర్చ.. ఎస్ఎంబీసీ బ్యాంక్-ఇండియా డివిజన్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సమావేశం.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్‌పై చర్చ
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ యూనిక్ డిజైన్ తో నిర్మాణ పనులకు సిద్ధం అవుతోంది. అక్టోబర్‌లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా… 30 నెలల గరిష్ఠ కాలపరిమితిలో పూర్తి చేయాలని APMRCL నిర్దేశించుకుంది. ఫస్ట్ ఫేజ్ కింద మూడు కారిడార్లు, 46.63 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది. ఎన్ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక కూడళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషనులు ఏర్పాటు కానున్నాయి. విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. సిటీ మీదుగా వెళుతున్న ఓల్డ్ నేషనల్ హైవే నిత్యం రద్దీగా ఉంటోంది. ఏటికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండగా సమస్య జటిలంగా మారుతోంది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. అయితే, మెట్రో రైలు ఏర్పాటు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించి ఆ ప్రయత్నం విరమించారు. కారిడార్ వన్ కింద కొమ్మాది- స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్లో భాగంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్‌లను అనుసంధానం చేసి ఒకే వంతెనగా నిర్మిస్తారు. గాజువాక – స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి రానుంది. మొత్తంగా 20 కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ వస్తుంది. ఇక్కడ కింద రోడ్డు… దానిపైన నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్‌లు వాటిపైన మెట్రో ట్రాక్ రానుంది. ఇది పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది.
కడప జిల్లాలో ఉప ఎన్నికల హీట్.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..
కడప జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ.. ఇలా కడప జిల్లాలో రెండు ZPTC స్థానాల కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కడప జిల్లాలోని 50 జడ్పీటీసీ స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ 49 దక్కించుకుంది. టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, పులివెందుల జడ్పీటీసీ చనిపోవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఒంటిమిట్ట ZPTC ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 2న పరిశీలన.. 5న ఉపసంహరణ ఉంటుంది. వచ్చేనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. పులివెందులలో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ, ఒంటిమిట్ట స్థానానికి మాత్రం తీవ్ర పోటీ ఉంటుందని లెక్క కడుతున్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీ కాగా.. ఇటు రెండు పార్టీలు గెలుపు కోసం వ్యూహరచనల్లో మునిగిపోయాయి. మొత్తానికి కడపలో ఈ రెండు స్థానాల్ని ఏపార్టీ దక్కించుకున్నా అది రికార్డే అవుతుందన్న చర్చ లోకల్‌గా సాగుతోంది.
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం.. ఓవర్ స్పీడ్ తో డ్రైవర్ల విన్యాసాలు
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మామూలు మత్తులో జోగటం తప్ప వారు చేసేది ఏమీ ఉండదు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈరోజు ఉదయం శాలిని అనే గృహిణి వాళ్ళ పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తు వాటర్ ట్యాంకర్ ఢీకొని చనిపోయారు. పుప్పాలగూడ మణికొండవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకర్లకు ప్రముఖ రాజకీయ నాయకుడు కి సంబంధించినవని ఆరోపిస్తున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతూ వాహనాలను ఇష్టారాజ్యం తిరగనిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక వాహనానికి కూడా సరైన డ్రైవర్ గాని ఫిట్నెస్ గాని లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే దందా అరికట్టకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు. గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తుందని ఇజ్రాయెల్‌కు స్టార్మర్ హెచ్చరించారు. తక్షణమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. గాజాలో మానవతా పరిస్థితులు మెరుగుపడాలని.. ఐక్యరాజ్యసమితి సహాయం అందించడానికి అనుమతించాలని కోరారు. లేదంటే సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రష్యాతీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరిక (సునామీ వాచ్) జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం లోతులో (సుమారు 19.3 కిలోమీటర్లు) సంభవించింది. దీని వలన ఉపరితలంపై బలమైన ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది.వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, 0100 GMT (భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30) తర్వాత 1 మీటర్ (సుమారు 3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరుకోవచ్చని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. పక్షవాతానికి గురైన మహిళ 20 ఏళ్ల తర్వాత రాయగలిగింది
ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ అద్భుతం చేసింది. ఆ కంపెనీ ఇటీవల మొదటిసారిగా ఒకే రోజులో ఇద్దరు వాలంటీర్ల మెదడుల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)ని అమర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరు రోగులు కోలుకుంటున్నారు, వారికి కంపెనీ P8, P9 అని పేరు పెట్టింది. ఆ కంపెనీ X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది. వారు ఒకే రోజులో P8, P9లకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలిపింది. న్యూరాలింక్ సహాయంతో, పక్షవాతం ఉన్నవారు ప్రయోజనం పొందుతారని, వారు తమ ఆలోచనా శక్తితో కంప్యూటర్ కర్సర్‌ను కదిలించగలరని భావిస్తున్నారు. కంపెనీ ఈ ప్రకటన తర్వాత, ఆడ్రీ క్రూస్ పోస్ట్ చేసింది. X ప్లాట్‌ఫామ్‌లో, ఆడ్రీ క్రూస్ తాను P9 అని, ఆమె తలలో న్యూరలింక్ చిప్ అమర్చబడిందని పోస్ట్ చేసింది.
లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. సాధారణంగా లోకి సినిమాల కథలు చూస్తే కార్తీతో చేసిన ఖైదీ లో డ్రగ్స్, కమల్ హాసన్ విక్రమ్ లో కూడా డ్రగ్స్, తుపాకులు, విజయ్ తో చేసిన మాస్టర్, లియో లోను గన్స్, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలు కథ నేపధ్యంగా ఎంచుకుంటూ హిట్స్ కొడుతూ వస్తున్నాడు. అయితే ఈ సారి లోకేష్ తన రెగ్యూలర్ ట్రాక్ ను మార్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలో NO GUNS.. NO DRUGS.. ఈ సారి ఏకంగా బంగారు వాచ్ లు స్మగ్లింగ్ వంటి అంశాన్ని కథ నేపథ్యంగా ఎంచుకున్నారట. లగ్జరీ వాచ్ లను విశాఖతీరం కేంద్రంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే అంశంతో రాబోతుంది. ఆ మధ్య గ్లిమ్స్ లోను వాచ్ లు పట్టుకుని రజనీకాంత్ ఫైట్ చేస్తుండే పోస్టర్స్ చుస్తే అర్ధం అవుతుంది. అయితే లోకి తన గత సినిమాల మాదిరి యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. కానీ ట్రాక్ మార్చిన లోకేష్ కనకరాజ్ హిట్ కొడితే ఓకే. రిజల్ట్ తేడా వస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నా కుతురుని చూస్తుంటే గర్వంగా ఉంది ..
బాలీవుడ్ దంపతులు అజయ్ దేవ్‌గణ్, కాజోల్ తమ కుమార్తె నైసా దేవ్‌గణ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక క్షణాన్ని ఓ వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ‘ఇది చాలా ఎమోషనల్ మోమెంట్.. గర్వంగా ఉంది’ అంటూ కాజోల్ స్పందించారు. 22 ఏళ్ల నైసా, స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ విభాగంలో బీబీఏ (బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) డిగ్రీని పొందింది. ఈ సందర్భంగా ఆమెకు సెలబ్రిటీల నుంచి, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇటీవల నైసా సినిమాల్లోకి అడుగుపెట్టనుందన్న వార్తలు వినిపించాయి. అయితే కాజోల్ వాటిని ఖండించారు. నైసా విద్యలో ఆసక్తి ఉన్నదని, ఆటలు, ట్రావెలింగ్ కూడా ఆమెకు ఇష్టమని పేర్కొన్నారు. అలాగే ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే, అజయ్ దేవ్‌గణ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈ ఆగస్టు 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇక కాజోల్ తాజా చిత్రం ‘సర్‌జమీన్’, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది.
బోయపాటి, బాబీ, గోపిచంద్, అనిల్ బిజీ.. వాట్ హ్యాపెన్ కొరటాల?
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న అఖండ2 షూటింగ్ చివరి దశకి వచ్చింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా, అఖండ 2 తర్వాత బోయపాటి శీను గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్యను డీల్ చేయబోతున్నాడని టాక్. ఢాకూ మహారాజ్‌తో బాలయ్య ఖాతాలో హిట్టేసిన బాబీ నెక్ట్స్ చిరంజీవిని లైన్లో పెట్టాడు. సెప్టెంబర్ నుండి ఈ నయా వెంచర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక వీర సింహారెడ్డి తర్వాత బాలీవుడ్‌లో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన గోపిచంద్ మలినేని టాలీవుడ్‌లో మళ్లీ లాండ్ అయ్యాడు. బాలయ్యతో 111ని సెట్ చేసుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి సంగతి తెలిసిందే. బాలయ్య, వెంకీ లైన్ లో ఉన్నారు. ఇలా ఈ డైరెక్టర్లంతా ఓ సినిమా కంప్లీట్ కాగానే లేదా థియేటర్లలోకి వచ్చిన ఆరునెలల్లోనే మరో హీరోను సెట్ చేస్తే కొరటాల దేవరతో హిట్ కొట్టి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త మూవీకి కమిటైన దాఖలాలు లేవు. అదిగో ఆ హీరో ఇదిగో ఈ హీరోతో కొరటాల నెక్ట్స్ సినిమా అంటున్నారు తప్ప అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. దేవర2 కోసమే వెయిట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. కానీ తారక్ ఇప్పట్లో చిక్కేట్లు లేడు. నీల్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ లైన్లో ఉన్నారు. కొరటాలకు కూడా తారక్ కమిట్మెంట్స్ తెలుసు. కానీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నాడో ఈ స్టార్ డైరెక్టర్. మళ్లీ ఎప్పుడు మెగాఫోన్ పడతాడో లెట్స్ సీ.