‘సేనతో సేనాని’.. నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్‌లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు.. రేపు, ఎల్లుండి పార్టీ లెజిస్లేచర్ మీటింగ్… వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు ఉండనున్నాయి.. ఇక, ఈనెల 30న సేనతో సేనాని బహిరంగ సభ ఉంటుంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 15 వేల మంది ఆహ్వానితులు తరలిరానున్నారు.. పార్టీ సంస్థాగత అంశాలు, కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళిక, స్థానిక ఎన్నికల సన్నద్ధత అజెండాగా ఈ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. విశాఖ మున్సిపల్ స్టేడియంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.. రేపు అనగా ఈ నెల 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ ఉండగా.. ఎల్లుండి పార్లమెంటు నియోజకవర్గాలవారీగా ఆది నుంచీ పార్టీ కోసం కష్టపడి, వైసీపీపై పోరాటం చేసిన కార్యకర్తలు, ఆహ్వానితులతో సమావేశం నిర్వహించబోతున్నారు.. ఇక, చివరి రోజు.. అంటే ఈ నెల 30న పార్టీ రాష్ట్రస్థాయి క్రియాశీల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఉండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ ప్రారంభంకానుంది.. సాయంత్రం ఆరు గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.. ఈ సమావేశాల్లో మహిళల బాధ్యత, అందరికీ రక్షిత నీరు, ఉపాధి కల్పన తదితర అంశాలతోపాటు కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై చర్చించనున్నట్టుగా ఇప్పటికే పార్టీ నేతలు ప్రకటించారు.. జనసేన నేతలు, కార్యకర్తలు.. కూటమిలో మిగిలిన 2 పార్టీల నేతలతో కలిసి ఏ విధంగా పనిచేయాలి… సోషల్ మీడియా వేదికగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి తదితర అంశాలపై చర్చ సాగనుంది..
జగద్గిరిగుట్టలో ఇంట్లో పేలిన సిలిండర్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
జగద్గిరిగుట్ట యస్బెస్టస్ కాలనిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఒరిస్సా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీలసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. సిలిండర్ పేలడంతో కాలనీ వాసులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సిలిండర్ పేలుడు ఘటనలో గాయాల పాలైన వారి వివరాలు.. రాజేష్ అతని ఇద్దరు భార్యలు గీతాంజలి, రీతాంజలి తో పాటు వారి ఇద్దరు పిల్లలు.. పక్కనే ఉన్న మరో గదిలో అద్దెకు ఉన్న మణికంఠ అతని భార్య.. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు డీఆర్ఎఫ్ టీమ్. శిథలలను తొలగిస్తోంది డీఆర్ఎఫ్ బృందం.
బైక్ పై వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలు.. ముగ్గురిని గుర్తించి పట్టుకున్న పోలీసులు
మాదాపూర్ లో పోకిరీల కిరాతకం వెలుగుచూసిన విషయం తెలిసిందే. బైక్ పై వెళ్తున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు పోకిరీలు. ముగ్గురు పోకిరీలు బైక్ పై ప్రయాణిస్తూ అమ్మాయి బ్యాక్ సైడ్ టచ్ చేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికురాలు పోకిరీల ఆగడాలపై వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ముగ్గురు పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు పోకిరీలను గుర్తించారు. మాదాపూర్ పోలీసులు ముగ్గురు పోకిరీలను పట్టుకున్నారు.
రేపు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్న మోడీ
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం మోడీ జపాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఆగస్టు 29-30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలియజేశారు. టోక్యోలో జరగనున్న 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని మోడీ-జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా మధ్య క్వాడ్ గ్రూపింగ్‌పై చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ఇదొక ముఖ్యమైన వేదిక అని విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు.
ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య
ఫిజీ ప్రధాని రబుకా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సోమవారం నాడు వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA) నిర్వహించిన సప్రూ హౌస్‌లో ‘ఓషన్ ఆఫ్ పీస్’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో రబుకా.. మోడీతో మాట్లాడుతూ.. ఎవరో ‘‘మీతో సంతోషంగా లేరు’’ అని, ‘‘మీరు ఆ అసౌకర్యాలను తట్టుకునేంత పెద్దవారు.’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా ఈ విధంగా సంభాషించారు.
సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఏడు నగరాల్లో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం మహిళా సిబ్బందినే నియమించాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. లింగ సమతుల్యత కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం తర్వాత ప్రస్తుత సివిల్ పోలీస్ ఫోర్స్ నుంచి తీసుకోబడిన సుమారు 600 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. అక్టోబర్ నుంచి లక్నో, కాన్పూర్, ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసు కమిషనరేట్లలో మహిళా సిబ్బంది నియమితులు కానున్నారు.
నేటి నుంచే భారత్‌పై 50 శాతం సుంకాలు అమలు..
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం.. ఇవాళ (ఆగస్టు 27న) తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి కొత్త టారీఫ్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి ఇండియన్ ఎగుమతులపై మొత్తం 50 శాతం భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. టారీఫ్స్ అమలుపై అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం సోమవారం నాడు ముసాయిదా ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల్లోగా ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు, రవాణాలో ఉన్న వాటికి మాత్రం అదనపు సుంకాలు వర్తించవు అని ముసాయిదాలో పేర్కొనింది. వాటిని సెప్టెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా, గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా యూఎస్ పరిగణించనుంది. వీటికి ప్రత్యేక కోడ్‌ను కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు, భారత్, బ్రెజిల్‌లపైనే అమెరికా అత్యధికంగా 50 శాతం టారీఫ్స్ విధించింది. వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం.. యూఎస్ అదనపు సుంకాల వల్ల 48.2 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఎఫెక్ట్ పడనుంది. మన దేశంపై అదనపు భారంతో అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీపడే దేశాలకు మరింత ప్రయోజనం కలగనుంది.
నటుడు విజయ్కి షాక్.. కేసు పెట్టిన పోలీసులు..
సినీ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదు అయింది. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. దళపతి విజయ్ ని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని అతడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. టీవీకే పార్టీ రెండో వార్షిక సమావేశం సందర్భంగా మధురైలో ఏర్పాటు చేసినా మహాసభ వేదికగా ప్రత్యేకంగా భారీ ర్యాంప్ నిర్మించారు. దళపతి విజయ్ ర్యాంప్‌పై నడుస్తూ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయనను కలిసేందుకు కొంతమంది అభిమానులు ర్యాంప్‌పైకి ఎక్కారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని కిందకు తోసేశారు బౌన్సర్లు.