యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆర్జీజీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వించారు సీఎం చంద్రబాబు.. ఈ సమావేశానికి సీఎస్ కే.విజయానంద్, వ్యవసాయశాఖ, వైద్యారోగ్యం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని సీఎంకు తెలిపారు అధికారులు.. మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందన్నారు.. అయితే నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.. ఎరువుల కేటాయింపు అంశంపై సమీక్షలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్ ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారు కేంద్రమంత్రి నడ్డా.. మరోవైపు, వచ్చే రబీ సీజన్ కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు.. ఎరువులు దొరకవనే ఆందోళనతో ఒకేసారి కొనుగోలు చేయకుండా, నిల్వ చేసి పెట్టుకోకుండా చూడాలన్నారు.. ఇక కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా సమీక్షించారు సీఎం.. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు.. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే… ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందు డబ్బాతో ఆత్మహత్య డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. పంటను కనీసం మార్కెట్ కు తేకుండా పురుగుమందు తాగినట్లు డ్రామా ఆడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు..
మరోసారి ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. కాగా, గతంలో లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిష్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే కాగా.. రాజ్ కేసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో, మరోసారి కోర్టును ఆశ్రయిస్తూ.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. మరోవైపు, ఈ కేసులో నాలుగోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి.. ఈ కేసులో ఏ6గా ఉన్నాు శ్రీధర్ రెడ్డి..
ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ వచ్చాయి.. అయితే, ఈ సారి రాష్ట్రంలోని 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీటీడీ ఈవోగా సింఘాల్ బదిలీ అయ్యారు.. గతంలో కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు సింఘాల్.. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు బదిలీ.. మెకిల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరవ్ గౌర్ బదిలీ.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు బదిలీ.. ఎక్సైజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్ కుమార్ మీనా బదిలీ.. కాంతిలాల్ దండే – అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ.. అనంత రాము – గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ.. హరిజవహర్ లాల్ – దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ.. ఎంవీ శేషగిరిబాబు – కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ.. సీహెచ్ శ్రీధర్ – మైనారిటీ శాఖ కార్యదర్శి.. ప్రవీణ్‌కుమార్-ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ)గా బదిలీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. ఇదే రైట్ టైం..!
రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఓటు వేయవచ్చన్న ఆయన.. తనను ఓడించిన కూటమి అభ్యర్థికి వైఎస్ జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడంలేదన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్న ఉపరాష్ట్రపతిని పారిపోయేలా చేసి.. మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం అంగీకరించినట్లే అవుతుందన్నారు.. బీజేపీకి చెక్ పెట్టాలంటే ఇదే రైట్ టైం అని తెలుగు ఎంపీలకు సూచించారు ఉండవల్లి..
కవిత సస్పెన్షన్ తర్వాత.. మొదటిసారి మీడియా ముందుకు కేటీఆర్! ఏమన్నారంటే?
బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కవిత సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతో.. సొంత కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే కవిత మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు. కవిత వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం అని, మరలా మాట్లాడానికి ఏమీ లేదన్నారు. ఒకసారి ఆక్షన్ తీసుకున్నాక నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పారు. కవితపై చర్యలు తీసుకున్నాక ఇక మాట్లాడేదేమి లేదని పేర్కొన్నారు. కవిత విషయంపై ఎక్కువగా మాట్లాడానికి కేటీఆర్ ఆసక్తి చూపలేదు. ఒక్క ముక్కలో కవిత సస్పెన్షన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎన్డీఏ vs ఇండియా రె’ఢీ’.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరి బలమెంత?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781. లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలో పాల్గొనే లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే పరిగణిస్తారు. ఈ ఎన్నికలో మెజార్టీ మార్కు 391. మీకు తెలుసా ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమికి 422 సభ్యుల బలముంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. విపక్షాల ఇండియా కూటమికి 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్డీఏకు మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రచారం ఎంత వరకు ఫలితం ఇస్తుందనేది మంగళవారం తేలనుంది.
ప్రపంచ వాణిజ్య సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి.!
ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను కొత్త అవకాశాలుగా మలచుకోవడానికి భారతదేశం తనకున్న అసాధారణ సామర్థ్యాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల్లో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతుల గమ్యస్థానాలు గణనీయంగా మారాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ (Nation First) అనే స్ఫూర్తితో ఈ మార్పును కొనసాగిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి EEPC కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు.
ఐడెంటిటీ ప్రూఫ్‌గా Aadhaar cardను పరిగణించాల్సిందే.. ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాల్సిందేనని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎన్నికల సమయంలో తమ గుర్తింపు సులభంగా నిరూపించుకునే అవకాశం కలగబోతుంది. సుప్రీంకోర్టు ఈ ఆదేశాన్ని ఇవ్వడానికి గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఆధార్ కార్డు దేశంలో అత్యంత నమ్మదగిన గుర్తింపు పత్రంగా ఉండడమే. ప్రభుత్వానికి, ప్రజలకు అనేక సేవలు అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, ఇప్పటివరకు ఎన్నికల సమయంలో ఆధార్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించడంలో అనేక పరిమితులు ఉండటం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉండేవి.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గాన్ సారథికి ప్రశ్న.. తెగ ఇబ్బందిపడ్డ పాక్ కెప్టెన్!
ఆసియా కప్ 2025 సమరానికి సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో టోర్నీకి తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో (సెప్టెంబర్ 9) అఫ్గానిస్థాన్, హాంకాంగ్ టీమ్స్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ మ్యాచ్.. సెప్టెంబర్ 12న పాకిస్థాన్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్గానిస్థాన్ టీమ్స్ ట్రై సిరీస్ ఆడాయి. ఈ సందర్భంగా ఓ ఘటన జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రై సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్గానిస్థాన్ జట్ల కెప్టెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓ విలేకరి అఫ్గాన్ సారథి రషీద్ ఖాన్‌కు ఓ ప్రశ్న సంధించాడు. ఆసియాలోనే రెండో అత్యుత్తమ టీమ్ అయిన మీరు ఆసియా కప్ 2025కు ఎలా సన్నద్ధమయ్యారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెగ ఇబ్బందిపడ్డాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద జట్లలో ఒకటైన పాక్‌ను పసికూన ముందు చిన్నగా చూడడంతో అఘా మొహం మొత్తం మారిపోయింది. తమ టీమ్ దారుణ ప్రదర్శనతో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే రీతిలో రియాక్షన్ ఇచ్చాడు. అఘా హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాపం సల్మాన్ అఘా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
డీజే టిల్లు డైరెక్టర్ కి సినిమా సెట్ అయింది!
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో విడుదలైన కామెడీ ఎంటర్‌టైనర్ DJ Tilluతో అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే భారీ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆకట్టుకోవడమే కాకుండా, ‘DJ Tillu’ అనే పాత్రను ఇంటి పేరుగా మార్చింది. చిన్న విరామం తర్వాత, విమల్ కృష్ణ మరోసారి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. తన తాజా ప్రాజెక్ట్‌తో మరో వింత పాత్రను సృష్టించి, సినీ అభిమానులను అలరించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.
చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం ఓ చైల్డ్ ఆర్టిస్టు కావాలని వెతుకుతున్నారు. అది కొంచెం పవర్ ఫుల్ గానే ఉంటుంది. చిరంజీవి గారి ముందు అశ్వినీ దత్ గారు వంద మంది చైల్డ్ ఆర్టిస్టుల ఫొటోలు పెట్టారు. కానీ చిరంజీవి నా ఫొటో తీసి ఇతను నాకు కావాలని అన్నాడంట.